బాసర ట్రిపుల్ ఐటీలో విద్యార్థులు(IIIT Basara Students) పట్టువీడని పోరాటం చేస్తున్నారు. తమ డిమాండ్లను ప్రభుత్వం ముందు ఉంచినా పట్టించుకోవడం లేదన్న ఆగ్రహంతో రెండ్రోజులుగా నిరసనలకు దిగారు. అయితే విద్యార్థుల డిమాండ్లలో ప్రధానమైనది వీసీని నియమించడం. తెలంగాణ ఏర్పడి 8 ఏళ్లవుతున్నా.. వీసీని నియమించకపోవడమేంటని విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే వీసీ నియమించడానికి ప్రభుత్వం ముందు చాలా చిక్కులున్నట్లు తెలుస్తోంది. టెక్నికల్‌గా వీసీని నియమించే అర్హత ఎవరికి ఉందన్నది ఇక్కడ తేలాల్సిన విషయం. ఉమ్మడి రాష్ట్రం లో మూడు ట్రిపుల్ ITలకు ఒకరే ఛాన్సలర్ ఉన్నారు. కాని విభజన తర్వాత ట్రిపుల్ ఐటీలకు చాన్స్‌లర్ లేకుండా పోయారు. ఆ చాన్స్‌లరే వీసీలను నియమించాల్సి ఉంటుంది. ఇప్పుడు చాన్స్‌లరే లేరు.. ఇక వీసీ నియామకం ఎక్కడిది.
ట్రిపుల్‌ఐటీ యాక్ట్ 18 ప్రకారం ఛాన్సలర్ , విసి నియామకం ప్రభుత్వం చేయాల్సి ఉంటుంది. దీని పై ప్రొఫెసర్ సులేమాన్ సిద్ధీకీ కమిటీని నియమించారు. ఇప్పటికిపుడు VCని నియమించడం కుదరని పని అని ప్రభుత్వం చెబుతోంది. వీసీ ప్లేస్‌లో ప్రతీ ట్రిపుల్ ఐటీకి డైరెక్టర్ నియామకం ఉంటుందన్నారు. సాధారణంగా అన్ని యూనివర్సిటీ లకు గవర్నర్ ఛాన్సలర్‌గా ఉంటారు కానీ ట్రిపుల్‌ఐటీలకు బిన్నంగా చట్టాన్ని రూపొందించారు. రెగ్యులర్ ఛాన్సలర్, వీసి కావాలంటే చట్ట సవరణ తప్పనిసరికానుంది.
ఇదిలావుంటే.. బాసర ట్రిపుల్ ఐటీలో ఆందోళన చేస్తున్న విద్యార్థులకు మద్దతు పలకడానికి వెళ్లిన సీపీఐ నారాయణను అడ్డుకున్నారు పోలీసులు. క్యాంపస్ గేట్ బయట కూర్చుని నిరసన తెలిపారు నారాయణ. విద్యార్థులవి సిల్లీ సమస్యలంటూ విద్యా శాఖమంత్రి సబిత ఇంద్రారెడ్డి చేసిన వ్యాఖ్యల్ని తీవ్రంగా తప్పుబట్టారాయన. నారాయణ వచ్చిన సందర్భంగా అక్కడ టెన్షన్ నెలకొంది.