మెట్ల బావిలో మ్యూజిక్‌ కాన్సెర్ట్‌లు! మంగ్లీ, హేమచంద్రా వంటి స్టార్లు కూడా వస్తారు..

సికింద్రాబాద్‌లోని బన్సీలాల్‌పేట్ మెట్ల బావి 17వ శతాబ్దపు నిజాం నిర్మాణ అద్భుతం. ఒకప్పుడు ప్రజల దాహం తీర్చిన ఈ బావి, శిథిలావస్థ నుండి తెలంగాణ ప్రభుత్వం కృషితో పునరుద్ధరించబడింది. ఇప్పుడు ఇది పర్యాటక కేంద్రంగా, సంగీత కచేరీలకు ప్రసిద్ధ వేదికగా మారింది.

మెట్ల బావిలో మ్యూజిక్‌ కాన్సెర్ట్‌లు! మంగ్లీ, హేమచంద్రా వంటి స్టార్లు కూడా వస్తారు..
Bansilalpet Stepwell

Edited By: SN Pasha

Updated on: Nov 15, 2025 | 8:33 PM

సికింద్రాబాద్‌లో ఓ ప్రత్యేకమైన బావి ఉంది. దానికి వందల ఏళ్ల చరిత్ర ఉంది. నిజాం కాలంలో ప్రజల దాహం తీర్చేందుకు నిర్మించిన బావి.. ఇప్పుడు మ్యూజిక్‌ కాన్సెర్ట్‌లకు వేదిక అవుతోంది. బన్సీలాల్‌ పేట్‌ మెట్ల బావిలో తెలుగు సింగర్లు హేమచంద్రా, మంగ్లీ లాంటి వాళ్లు కూడా తమ పాటతో పర్యాటకులకు వినోదం పంచుతున్నారు. అసలు బావిలో మ్యూజిక్‌ కాన్సెర్ట్‌లు ఏంటని ఆశ్చర్యపోతున్నారా? అయితే మీరు ఈ చరిత్ర తెలుసుకోవాల్సిందే..

17వ శతాబ్దంలో అప్పటి నిజాం అసఫ్‌ జాహీ వంశస్థులు ప్రజల తాగునీటి అవసరాల కోసం ఈ పెద్ద బావిని తవ్వించారు. 53 అడుగుల లోతు నుంచి ఆరు అంతస్థుల మెట్లు, మండపాలు, స్తంభాలతో ఆ బావిని ప్రత్యేకంగా తీర్చిదిద్దారు. ఆ కాలం నాటి నిర్మాణ శైలిని ఉట్టిపడేలా నిర్మాణం సాగింది. ఈ బావిలో 22 లక్షల లీటర్ల వరకు నీటిని నిల్వ చేసేందుకు సామర్థ్యం ఉంది. కాలక్రమేణా ఆ ప్రాంతంలో సేట్‌ బన్సీలాల్‌ అనే వ్యాపారి పేరు మీద ఆ ప్రాంతానికి బన్సీలాల్‌ పేట్‌ అనే పేరొచ్చింది. దాంతో బావిని కూడా బన్సీలాల్‌ పేట్‌ మెట్ల బావి అని పిలుస్తున్నారు. నిజాం పాలన ముగిసిన తర్వాత బావిని ఎవరూ పట్టించుకోలేదు. సరైన మెంటెనెన్స్‌ లేక బావిలో చెత్త పేరుకుపోయి శిథిలావస్థకు చేరింది. 1933లో బ్రిటిష్ అధికారిగా ఉన్న టీహెచ్ కీస్ ఈ బావిని పునరుద్ధరించారు.

మళ్లీ 2021లో తెలంగాణ ప్రభుత్వం, రెయిన్ వాటర్ ప్రాజెక్ట్ సహకారంతో దాదాపు 500 మెట్రిక్ టన్నుల మట్టి, చెత్తను తీసివేసి బావిని అభివృద్ధి చేసి, ఎంతో చరిత్ర కలిగి, అందమైన నిర్మాణం ఉన్న బావిని పర్యాటక కేంద్రంగా మార్చాలని నిర్ణయించారు. ప్రస్తుతం బావిని బాగు చేసిన తర్వాత విద్యుద్దీపాలతో అలంకరించి, బయట గ్యాలరీ, గార్డెన్, అంపీ థియేటర్ నిర్మించారు. దీంతో ఇది ఇప్పుడో పర్యాటక ప్రాంతంగా మారింది. వీకెండ్స్‌లో బన్సీలాల్ పేట్ స్టెప్‌ వెల్‌ అంఫి థియేటర్లో మ్యూజిక్ కాన్సెర్ట్‌లు జరుగుతున్నాయి. హేమచంద్రా లాంటి పెద్ద పెద్ద సింగర్స్ తో ఇక్కడ మ్యూజిక్ కాన్సెర్ట్‌లు నిర్వహిస్తున్నారు. ఈ మెట్ల బావిని సందర్శించడానికి రూ.50 ఎంట్రీ టికెట్ ఉంటుంది. కానీ మ్యూజిక్ కాన్సెప్ట్ అటెండ్ అవ్వాలంటే రూ.1500 టికెట్ తీసుకోవాలి. చల్లటి సాయంత్రం వేళ అత్యంత అద్భుతంగా విద్యుత్ దీపాలతో అలంకరించిన మెట్ల బావిలో మ్యూజిక్ వన్ సైడ్ వింటుంటే ఎక్కడో విదేశాల్లో టూరిస్టర్ స్పాట్లో ఉన్న ఫీలింగ్ కచ్చితంగా కలుగుతుంది. అయితే దీనికి లిమిటెడ్ సీట్లు మాత్రమే ఉంటాయి. మ్యూజిక్ కాన్సెర్ట్‌ జరిగిన ప్రతిసారి కేవలం 50 నుంచి 100 టికెట్లు మాత్రమే అమ్ముతారు.

మరిన్ని ట్రెండింగ్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి