Bandi Sanjay Meets Amit Shah: తెలంగాణలో వరదలు, వర్షాల కారణంగా సంభవించిన నష్టాన్ని అంచనా వేసేందుకు త్వరలో కేంద్రం నుంచి హై పవర్ కమిటీ రాష్ట్రానికి రానుంది. వరదల నష్టాన్ని అంచనా వేసి ఈ కమిటీ కేంద్ర ప్రభుత్వానికి నివేదిక సమర్పించనుంది. తెలంగాణలో సంభవించిన వరదలు, వాటి వల్ల ప్రజల ఎదుర్కొంటున్న ఇబ్బందులను బీజేపీ నాయకులు.. కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడంతో.. దీనిపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్పందించారు. ఈ మేరకు మంగళవారం తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్, రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జ్ తరుణ్ చుగ్‌తో కలిసి కేంద్ర హోం మంత్రి అమిత్ షాను కలిశారు. దీనిపై స్పందించిన అమిత్ షా వెంటనే హోం మంత్రిత్వ శాఖలోని అధికారులతో హైపవర్ కమిటీ ఏర్పాటు చేశారు. తక్షణమే ఆ కమిటీని తెలంగాణకు పంపించాలని అమిత్ షా అధికారులను ఆదేశించారు.
ఈ మేరకు ఎంపీ బండి సంజయ్.. అమిత్ షాకు కృతజ్ఞతలు తెలుపుతూ ట్విట్ చేశారు. వరదల వల్ల పొలాలు, ఇళ్లు, ప్రజలు, ప్రాజెక్టులకు జరిగిన నష్టాన్ని ఓపికగా విన్నందుకు, ప్రకృతి విధ్వంసం గురించి తమ ఆందోళనలను అర్థం చేసుకుని వెంటనే స్పందించినందుకు కృతజ్ఞతలంటూ ట్విట్ చేశారు. వర్షాలు, వరదల వల్ల జరిగిన నష్టాన్ని అంచనా వేయడానికి కేంద్ర హోం మంత్రిత్వ శాఖ హైపవర్ కమిటీ తెలంగాణను సందర్శించి నివేదికను అందజేసిన అనంతరం కేంద్రం.. పరిహారం ప్రకటించనున్నట్లు తెలుస్తోంది.
మరిన్ని జాతీయ వార్తలు చదవండి