టెన్త్ క్లాస్ ఎగ్జామ్ పేపర్ అవుట్ అయిన కేసులో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ కుమార్ తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. తెలంగాణ హైకోర్టులో బండి సంజయ్ క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. కమలాపూర్‌లో తనపై నమోదైన ఎఫ్ఐఆర్ కొట్టివేయాలని ఈ పిటిషన్‌లో అభ్యర్థించారు. కమలాపూర్ స్కూల్ హెడ్‌మాస్టర్‌తో పాటు, స్థానిక పోలీసులకు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. జూన్ 16కు తదుపరి విచారణను వాయిదా వేసింది హైకోర్టు. టెన్త్ క్లాస్ హిందీ ఎగ్జామ్ పేపర్ బయటకు వచ్చిన కేసులో బండి సంజయ్ కుమార్‌కు మంజూరైన బెయిల్ పిటిషన్‌ను రద్దు చేయాలని కోరుతూ పోలీసులు హన్మకొండ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
ఎస్ఎస్సీ హిందీ పేపర్ వాట్సాప్ ద్వారా బయటకు వచ్చిన కేసులో బండి సంజయ్ కుమార్ పోలీసులకు ఏమాత్రం సహకరించడం లేదని.. ఫోన్ ఇవ్వడం లేదని ఆ పిటిషన్ లో పోలీసులు పేర్కొన్నారు. అంతేకాకుండా బెయిల్ నిబంధనలు ఉల్లంఘించి రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నారని అందులో ఆరోపించారు. అందుకే బండి సంజయ్ బెయిల్ పిటిషన్ రద్దు చేయాలని కోరుతూ వరంగల్ పోలీసులు తరఫున పబ్లిక్ ప్రాసిక్యూటర్ పిటిషన్ దాఖలు చేశారు.
బండి సంజయ్ బెయిల్ రద్దు చేయాలని గతంలోనూ పిటిషన్ దాఖలు చేయగా.. దానిని హైకోర్టు తిరస్కరించింది. మరోవైపు ఈ కేసులో నిందితులు ఏ6, ఏ9 బెయిల్ పిటిషన్లపై కూడా వాదనలు ముగిశాయి.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం