అయ్యప్ప భక్తులు, భైరి నరేష్ మధ్య మళ్లీ గొడవ రాజుకుంది. దీంతో ములుగు జిల్లా ఏటూరునాగారంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. గతంలో అయ్యప్ప పుట్టుకను ప్రశ్నించిన భైరి నరేష్.. ములుగు జిల్లా ఏటూరు నాగారంలో నాస్తిక సంఘం ఆధ్వర్యంలో జరిగే ఓ కార్యక్రమానికి హాజరయ్యాడు. ఈ విషయాన్ని తెలుసుకున్న అయ్యప్ప భక్తులు నాస్తికుడు నరేష్ ను అడ్డుకున్నారు. నరేష్ గో బ్యాక్ అంటూ నినాదాలు చేశారు. ఈ క్రమంలో నరేష్ వాహనం.. నరసింహారావు అనే భక్తుడిపైకి దూసుకెళ్లింది. దీంతో అతనికి తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే అతన్ని ఆస్పత్రికి తరలించారు. నరేష్ వాహనం ఢీకొనడంతో ఆగ్రహించిన అయ్యప్పభక్తులు..జాతీయ రహదారిపై నిరసనకు దిగారు. భైరి నరేష్‌ను అరెస్ట్ చెయ్యాలని అయ్యప్పభక్తులు డిమాండ్ చేస్తున్నారు.
ఇదిలాఉంటే.. ఏటూరు నాగారం ఘటన నుంచి వెళ్తుండగా.. బైరి నరేష్ వాహనానికి ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో నరేష్ స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. ఏటూరునాగారంలో అయ్యప్ప భక్తుడి పై వాహనం దూసుకెళ్లిన అనంతరం.. వెనుదిరిగి వస్తుండగా.. నరేష్ వాహనం ప్రమాదానికి గురైంది. కమలాపూర్ సమీపంలో అదుపుతప్పి రోడ్డు పక్కన చెట్టును బైరి నరేష్ వాహనం ఢీకొట్టింది. ఈ క్రమంలో సకాలంలో ఎయిర్ బెలూన్లు ఓపెన్ అవడంతో స్వల్ప గాయాలతో నరేష్ బయటపడ్డాడు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..