Hyderabad: క్రియేటివిటీ కాదు సుబ్బారావు గారు.. పిచ్చండీ ఇది.! ఆటోకి అంబులెన్స్ లైట్లు.. సీన్ కట్ చేస్తే

ఓ ఆటోకి పైన అంబులెన్స్ లైట్లు పెట్టి రోడ్లపై తిప్పుతున్నారు. అంబులెన్స్ లాగా శబ్దాలు చేసేసరికి పాపం.. ఎవరికి ఏం జరిగిందో, అంబులెన్స్ వస్తుందని అనుకుని దారి ఇస్తున్నారు. తీరా అది వాళ్లను దాటి ముందుకు వెళ్లిపోతుంటే, అక్కడ ఆటో వెళ్తుండడం చూసి నోరెళ్లబెడుతున్నారు. ఇలా అంబులెన్స్ లైట్లు..

Hyderabad: క్రియేటివిటీ కాదు సుబ్బారావు గారు.. పిచ్చండీ ఇది.! ఆటోకి అంబులెన్స్ లైట్లు.. సీన్ కట్ చేస్తే
Auto Rickshaw

Edited By: Ravi Kiran

Updated on: Dec 01, 2025 | 2:00 PM

చేసే ఏ పనిని అయినా మంచికి ఉపయోగిస్తే దానికి ఒక అర్థం ఉంటుంది.. అలా కాకుండా అతి తెలివితేటలు ప్రదర్శిస్తే ఇదిగో ఇలాగే ఉంటుంది. పైగా దానికి క్రియేటివిటీని జోడించి, ఏదో గొప్ప పని చేశామని అనుకుంటే మాత్రం దానికన్నా పిచ్చితనం ఇంకోటి ఉండదు. ఈ మధ్య సోషల్ మీడియా ప్రభావం పెరిగాక కూడా ఇలాంటివి చాలానే చేస్తున్నారు. ఏదైనా అందరికీ విచిత్రంగా తోచేలా చేస్తేనే ఫేమస్ అయిపోతామని అనుకుంటున్నారో మరి ఏమో.. పాతబస్తీ రోడ్లపై రాత్రి వేళల్లో తిరుగుతున్న ఈ ఆటో సంగతి కూడా దాదాపు అలాగే ఉంది.

ఓ ఆటోకి పైన అంబులెన్స్ లైట్లు పెట్టి రోడ్లపై తిప్పుతున్నారు. అంబులెన్స్ లాగా శబ్దాలు చేసేసరికి పాపం.. ఎవరికి ఏం జరిగిందో, అంబులెన్స్ వస్తుందని అనుకుని దారి ఇస్తున్నారు. తీరా అది వాళ్లను దాటి ముందుకు వెళ్లిపోతుంటే, అక్కడ ఆటో వెళ్తుండడం చూసి నోరెళ్లబెడుతున్నారు. ఇలా అంబులెన్స్ లైట్లు పెట్టి హారన్ చేస్తూ వెళ్తున్న ఆటో హైదరాబాద్ నగరంలోని పాతబస్తీ గల్లీల్లో కనిపించింది. రోగులను ఆస్పత్రులకు తరలించే అంబులెన్స్ సౌండ్ లాగా ఆ ఆటో శబ్దాలు చేస్తూ వెళ్తుంటే, కొందరు దారి ఇస్తున్నారు.. చూసేవారు ఇదేంటిలా ఉందని వింతగా చూస్తున్నారు. లేదంటే ఎవరైనా ప్రముఖుల వాహనాలు వెళ్తున్నాయేమో అని భ్రమపడి, భయపడి దారి వదులుతున్నారు. ఇటీవల పాతబస్తీ ప్రధాన రహదారుల్లో రాత్రిపూట ఈ ఆటో సంచరించడం కలకలం రేపింది. రాత్రివేళ పెద్ద పెద్ద శబ్దాలు చేస్తూ రోడ్డు మీద వచ్చీ పోయేవారిని తెగ ఇబ్బందులకు గురి చేసింది ఈ ఆటో.

క్రియేటివిటీ బాగానే ఉంది.. ఆటోకి అంబులెన్స్ హారన్ పెట్టి తిప్పుతున్నారు.. అంతవరకు సరే.. అదే నిజంగానే ఎవరైనా అత్యవసర పరిస్థితుల్లో ఉంటే ఇలాంటి ఆటోలో తరలించడం ఒక రకంగా మంచిదే. మరి ఇదేదో వెర్రి వేషాల కోసం కాకుండా అలా ఉపయోగపడే ప్రయత్నమే ఏదో చేసి ఉంటే అయినా పది మందికి మంచి జరిగేది కదా అని ఈ ఆటో గురించి విన్నవాళ్లు, చూసినవాళ్లు చెబుతున్నారు. ఏది ఏమైనా.. మనం చేసే ఏ పని అయినా ఇతరులను ఇబ్బంది పెట్టనంత వరకు సరేసరి.. అలా కాని పక్షంలో ఎలాంటిదైనా సహించేది లేదు. సమాజం పట్ల, ప్రజల పట్ల బాధ్యతగా మెలిగేవారు ఇలాంటి పిచ్చి పనులు చేయరు కానీ, చేసే ముందు అది మంచికా చెడుకా అని కనీస ఆలోచన మాత్రం తప్పనిసరిగా ఉండాల్సిందే.