కర్ణాటక మహిళకు షాక్ ఇచ్చిన ఆటో డ్రైవర్ మంచితనం.. పోలీసుల ప్రశంసలు!
హైదరాబాద్ నగరానికి వచ్చిన ఓ కర్ణాటక మహిళ తన విలువైన ఆభరణాలు, డబ్బును తాను ఎక్కిన ఆటోలో మర్చిపోయింది. ఆ తర్వాత గుర్తించి పోలీసులను ఆశ్రయించింది. పోలీసులు దర్యాప్తులు ఆమె ప్రయాణించిన ఆటో డ్రైవర్‌ను గుర్తించారు. అయితే, అతడు తన ఆటోలో ఉన్న ప్రయాణికురాలి బంగారు ఆభరణాలు, నగదు తిరిగిచ్చేశాడు. దీంతో ఆ వ్యక్తిని పోలీసులు అభినందించారు.

హైదరాబాద్ నగరంలో ఓ ఆటో డ్రైవర్ చూపిన నిజాయితీ అందరి ప్రశంసలు అందుకుంది. ప్రయాణికురాలు మరిచిపోయిన బంగారు ఆభరణాలు, నగదుతో కూడిన బ్యాగ్‌ను సురక్షితంగా తిరిగి ఇచ్చి అతడు ఆదర్శంగా నిలిచాడు. గురువారం సాయంత్రం 6.45 గంటల సమయంలో కర్ణాటకలోని గుల్బర్గా ప్రాంతానికి చెందిన సుజాత ఆర్. హిరేమత్ (43) నర్సింగి నుంచి బిర్లా మందిర్‌కు ఆటోలో ప్రయాణించింది. అయితే దిగిన తర్వాత తన బ్యాగ్‌ను ఆటోలోనే మరిచిపోయినట్లు గుర్తించింది. ఆ బ్యాగ్‌లో సుమారు 6.5 తులాల బంగారు ఆభరణాలు, రూ.3,500 నగదు ఉన్నాయి. దీంతో ఆమె సైఫాబాద్ పోలీస్ స్టేషన్‌ను ఆశ్రయించింది. ఫిర్యాదు స్వీకరించిన ఇన్స్పెక్టర్ ఏ. సీతయ్య వెంటనే స్పందించి, కానిస్టేబుళ్లు వినయ్ కుమార్, మదన్ మోహన్‌లకు దర్యాప్తు బాధ్యతలు అప్పగించారు. సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా ఆటోను గంటలోపే గుర్తించారు.
ఆటో డ్రైవర్ కె. నాగేశ్‌ను సంప్రదించగా, బ్యాగ్ తన ఆటోలో సురక్షితంగా ఉందని తెలిపారు. అనంతరం ఆయన స్వయంగా పోలీస్ స్టేషన్‌కు చేరుకుని, బంగారం, నగదును యథాతథంగా అప్పగించారు. పోలీసులు సొత్తును బాధితురాలికి అందజేశారు. డ్రైవర్ నిజాయితీకి ఇన్స్పెక్టర్ సీతయ్య ప్రశంసలు తెలియజేస్తూ, నగదు బహుమతి అందించారు. నిజాయితీకి నిలువెత్తు ఉదాహరణగా నిలిచిన ఆటో డ్రైవర్ మంచితనం.. నగరంలో అరుదైన ఘటనగా మారింది.
