
భాగ్యనగరం మరో ప్రతిష్టాత్మక అంతర్జాతీయ సదస్సుకు వేదిక కాబోతోంది. ప్రపంచ ఆరోగ్య సంరక్షణ రంగంలో విప్లవాత్మక మార్పులు, రోగుల భద్రత, అత్యాధునిక సాంకేతికతపై చర్చించేందుకు గ్లోబల్ వేదిక సిద్ధమైంది. అపోలో హాస్పిటల్స్ నిర్వహిస్తున్న ప్రతిష్టాత్మక ఇంటర్నేషనల్ హెల్త్ డైలాగ్ 13వ ఎడిషన్ ఈ నెల 30, 31 తేదీల్లో హైదరాబాద్‌లో జరగనుంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న వైద్యులు, శాస్త్రవేత్తలు, ప్రభుత్వ ప్రతినిధులు, టెక్నాలజీ నిపుణులు అందరూ ఒకే చోట చేరి.. రాబోయే రోజుల్లో సామాన్యులకు వైద్యం మరింత సులభంగా, నాణ్యంగా ఎలా అందించాలో చర్చించే వేదిక ఇది. ఈ ఏడాది ‘గ్లోబల్ వాయిసెస్.. వన్ విజన్’ అనే నినాదంతో ఈ సదస్సు నిర్వహిస్తున్నారు.
ఈ అంతర్జాతీయ సదస్సుకు వివిధ దేశాల ఆరోగ్య మంత్రులు హాజరుకానున్నారు. నైజర్ ప్రజారోగ్య మంత్రి డాక్టర్ కల్నల్ మేజర్ గార్బా హకిమి, పాపువా న్యూ గినియా ఆరోగ్య మంత్రి ఎలియాస్ కపావోర్, (కాంగో రిపబ్లిక్ ఆరోగ్య మంత్రి ప్రొఫెసర్ జీన్ రోసైర్ ఇబారా, బెర్ముడా ఆరోగ్య మంత్రి కిమ్ విల్సన్ హాజరవుతున్నారు. వీరితో పాటు ది జాయింట్ కమిషన్ సీఈఓ డాక్టర్ జోనాథన్ పెర్లిన్, NABH సీఈఓ డాక్టర్ అతుల్ మోహన్ కొచ్చర్ వంటి దిగ్గజాలు పాల్గొని రోగుల భద్రత, ఏఐ అప్లికేషన్లపై ప్రసంగించనున్నారు.
రోగుల భద్రత: చికిత్స సమయంలో రోగులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూసుకోవడం.
టెక్నాలజీ : వైద్య రంగంలో కంప్యూటర్లు, రోబోలు మరియు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాడకాన్ని పెంచడం.
రోగి అనుభవం: ఆసుపత్రికి వచ్చిన వారికి మెరుగైన వసతులు, సానుభూతితో కూడిన సేవలు అందించడం.
కొత్త చికిత్సలు: గుండె జబ్బులు, క్యాన్సర్ మహిళల ఆరోగ్య సమస్యలకు వస్తున్న సరికొత్త మందులు, చికిత్సల గురించి వైద్యులకు అవగాహన కల్పించడం.
వైద్య రంగంలో కొత్త ఐడియాలతో వచ్చే యువత కోసం THNX అనే కొత్త ప్లాట్‌ఫామ్‌ను ఇక్కడ ప్రారంభించబోతున్నారు. అలాగే ‘సేఫ్-ఎ-థాన్’ పేరుతో ఒక పోటీని నిర్వహించి, తక్కువ ఖర్చుతో రోగుల సమస్యలను ఎలా పరిష్కరించవచ్చో నిరూపించిన వారికి ప్రోత్సాహం అందిస్తారు.
అపోలో హాస్పిటల్స్ గ్రూప్ జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ సంగీత రెడ్డి మాట్లాడుతూ.. ‘‘హైదరాబాద్ వేదికగా జరుగుతున్న ఈ సదస్సు ఏఐ, డేటా సైన్స్, డిజిటల్ వ్యవస్థలను మానవీయ విలువలతో జోడిస్తుంది. ఆరోగ్య సంరక్షణను మరింత స్థిరంగా, ముందస్తుగా అంచనా వేసే విధంగా మార్చడమే మా లక్ష్యం’’ అని తెలిపారు. 1983లో డాక్టర్ ప్రతాప్ సి. రెడ్డి ప్రారంభించిన అపోలో గ్రూప్.. నేడు 74 ఆసుపత్రులతో ప్రపంచంలోనే అతిపెద్ద సమీకృత ఆరోగ్య సంరక్షణ వేదికగా ఎదిగింది. ఇప్పుడు హైదరాబాద్‌లో జరగనున్న ఈ ఐహెచ్‌డి సదస్సు ప్రపంచ ఆరోగ్య చిత్రపటంలో మరో మైలురాయిగా నిలవనుంది.