విభజన సమస్యల పరిష్కారానికి మూడు స్థాయిల్లో కమిటీలు: భట్టి విక్రమార్క, సత్యప్రసాద్
ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబునాయుడు, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హైదరాబాద్‌లోని ప్రజాభవన్‌లో తొలిసారిగా ముఖాముఖి భేటీ అయ్యారు. రెండు తెలుగు రాష్ట్రాల మధ్య పరిష్కారానికి నోచుకోని విభజన అంశాలపై ప్రధానంగా చర్చించారు.

ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబునాయుడు, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హైదరాబాద్‌లోని ప్రజాభవన్‌లో తొలిసారిగా ముఖాముఖి భేటీ అయ్యారు. రెండు తెలుగు రాష్ట్రాల మధ్య పరిష్కారానికి నోచుకోని విభజన అంశాలపై ప్రధానంగా చర్చించారు. భేటీలో చర్చించిన అంశాలను తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, ఏపీ మంత్రి సత్య ప్రసాద్, ఇతర మంత్రులు మీడియా సమావేశంలో వెల్లడించారు.
రాష్ట్ర విభజన సమస్యలపై ప్రజా భవన్‌లో సుమారు రెండు గంటలపాటు ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చర్చించారు. సమస్యల పరిష్కారానికి రెండు రాష్ట్రాల మంత్రులతో ఉప సంఘం వేయాలని నిర్ణయం తీసుకున్నట్లు డిఫ్యూటీ సీఎం భట్టి విక్రమార్క వెల్లడించారు. శాఖలవారీగా చర్చల కోసం ఉన్నతాధికారులతో మరో కమిటీ వేస్తామని తెలిపారు. ప్రభుత్వ ప్రధానాధికారి స్థాయిలో చర్చల ద్వారా, పట్టు విడుపులతో సమస్యలు పరిష్కరించుకోవాలని ముఖ్యమంత్రులు నిర్ణయించినట్లు తెలిపారు.
డ్రగ్స్ రహిత సమాజమే లక్ష్యంగా కృషి చేయాలని రెండు రాష్ట్రాలు కీలక నిర్ణయం తీసుకున్నాయి. రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు డ్రగ్స్‌కి దూరం చేయాలని.. డ్రగ్స్ నిర్మూలనకు సహకరించాలని ఇద్దరు ముఖ్యమంత్రులు తీర్మానం చేసినట్లు భట్టి వెల్లడించారు. ఇటీవల డ్రగ్స్ రహిత తెలంగాణపై యాంటీ నార్కోటిక్ టీమ్ చేస్తున్న కృషీని అభినందించిన ఏపీ సీఎం చంద్రబాబు, రెండు రాష్ట్రాలకు చెందిన డీజీ స్థాయి అధికారులతో కమిటీ వేయాలని నిర్ణయించారు. డ్రగ్స్‌తోపాటు సైబర్ క్రైమ్ అరికట్టేందుకు కఠినమైన నిర్ణయాలు తీసుకోవాలని ఇద్దరు ముఖ్యమంత్రులు సూచించారు.
యాంటీ నార్కోటిక్స్ , సైబర్ క్రైమ్ అరికట్టేందుకు రెండు రాష్ట్రాల మధ్య ఉమ్మడి పోరాటం చేసి రెండు రాష్ట్రాలను కాపాడుకునేందుకు ముందుకెళ్లాలని నిర్ణయించినట్ల రెండు రాష్ట్రాల మంత్రులు భట్టి విక్రమార్క తెలిపారు. డ్రగ్స్, గంజాయి నిర్మూలనకు ఏపీలోనూ చర్యలు తీసుకుంటున్నట్టు ఏపీ మంత్రి సత్య ప్రసాద్ వివరించారు. తెలంగాణ మంత్రులు శ్రీధర్‌బాబు, పొన్నం ప్రభాకర్, ఏపీ మంత్రులు బీసీ జనార్దన్‌రెడ్డి, కందుల దుర్గేశ్ తదితరులు మీడియా సమావేశంలో పాల్గొన్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..