Weather Report: తెలుగు రాష్ట్రాలకు మరోసారి వర్ష సూచన కనిపిస్తోంది. గత పది రోజుల క్రితం భారీ వర్షాలకు ఇటు తెలంగాణతో పాటు ఏపీలోనూ పరిస్థితులు భయానకంగా మారిన విషయం తెలిసిందే. అయితే తాజాగా మరోసారి వర్షాలు పడే అవకాశాలున్నాయని వాతావారణ శాఖ తెలిపింది. బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ద్రోణి ప్రభావం కారణంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో అక్కడక్కడా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. నేడు, రేపు ఆంధ్రప్రదేశ్‌లో తేలికపాటి వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. ఇక తెలంగాణలోనూ తేలికపాటి జల్లులు కురవనున్నట్లు తెలిపింది.
ఏపీలోని ఉత్తర కోస్తా ఆంధ్ర ,యానాంలో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు పడనున్నాయని వాతావారణ శాఖ తెలిపింది. దక్షిణ కోస్తా ఆంధ్రాలో ఆదివారం తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు ఒకటి లేక రెండు ప్రదేశాల్లో కురిసే అవకాశం ఉంది. రాయలసీమలోనూ అక్కడక్కడ వర్షం పడే అవకాశాలున్నాయి.
ఇదిలా ఉంటే ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో వాగులు, వంకలు పొంగిపొర్లాయి. లోతట్టు ప్రాంతాలన్నీ నీటమునిగాయి. వరదల కారణంగా హైదరాబాద్ గచ్చిబౌలిలో ఓ సాఫ్ట్‌వేర్ ఉద్యోగి మరణించిన సంఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే.