అపర భగీరథుని కలల పంట కాళేశ్వరం

తెలంగాణాలో లక్షలాది ఎకరాల మెట్ట భూములను గోదావరి నీటితో తడిపే మహాద్భుత కాళేశ్వరం ప్రాజెక్టు సీఎం కేసీఆర్ కలల పంట. కాళేశ్వరంలోని ముక్తీశ్వరుడి సాక్షిగా గోదావరి జలాలతో రాష్ట్రానికి అభిషేకం చేసే మహా క్రతువు ఇది ! భగీరథుడు గంగను దివినుంచి భువికి దించితే కేసీఆర్ భగీరథ యత్నం తెలుగుగంగను నేల నుంచి నింగికి ఎత్తే సరికొత్త చరిత్ర మొదలైంది. మూడేళ్ళ కేసీఆర్ కల సాకారం, రూ. 80 వేల కోట్ల వ్యయంతో నిర్మించిన ఈ బహుళార్థ […]

అపర భగీరథుని కలల పంట కాళేశ్వరం

Updated on: Jun 21, 2019 | 12:01 PM

తెలంగాణాలో లక్షలాది ఎకరాల మెట్ట భూములను గోదావరి నీటితో తడిపే మహాద్భుత కాళేశ్వరం ప్రాజెక్టు సీఎం కేసీఆర్ కలల పంట. కాళేశ్వరంలోని ముక్తీశ్వరుడి సాక్షిగా గోదావరి జలాలతో రాష్ట్రానికి అభిషేకం చేసే మహా క్రతువు ఇది ! భగీరథుడు గంగను దివినుంచి భువికి దించితే కేసీఆర్ భగీరథ యత్నం తెలుగుగంగను నేల నుంచి నింగికి ఎత్తే సరికొత్త చరిత్ర మొదలైంది. మూడేళ్ళ కేసీఆర్ కల సాకారం, రూ. 80 వేల కోట్ల వ్యయంతో నిర్మించిన ఈ బహుళార్థ సాధక ప్రాజెక్టు విశేషాలు ఇన్నీఅన్నీ కావు. మేడిగడ్డ బ్యారేజీ వద్ద వరుణుడి కరుణకోసం వేద పండితులు నిర్వహించిన జల, మహా సంకల్ప యాగంలో కేసీఆర్ దంపతులు పాల్గొనగా.. వివిధ పంప్ హౌస్ ల వద్ద జరిగిన ప్రత్యేక పూజల్లో మంత్రులు పాల్గొన్నారు. శృంగేరీ పీఠానికి చెందిన ఫణి శశాంక శర్మ, గోపీకృష్ణ ఆధ్వర్యంలో 40 మంది వేద పండితులు హోమం నిర్వహించగా.. వరుణుడు కరుణించాడా అన్నట్టు చిరు జల్లులు మొదలయ్యాయి.
తెలంగాణాలో 13 జిల్లాలకు సాగు, తాగు నీరందించే బాహుబలి ప్రాజెక్టు ఇది ! గోదావరి నదిపై నిర్మించిన ఈ ప్రాజెక్టు ప్రారంభోత్సవంలో గోదావరి నదీ బేసిన్ పరిధిలోని కీలక రాష్ట్రాల ముఖ్యమంత్రులు పాల్గొనడం విశేషం. మూడు బ్యారేజీలు, 1531 కి.మీ. గ్రావిటీ కాలువలు, 203 కి.మీ. టన్నెళ్లు, 19 పంప్ హౌస్ లు, మొత్తం 147 టీఎంసీల నీటి సామర్థ్యంతో నిర్మిస్తున్న ఈ ప్రాజెక్టు ప్రపంచంలోనే అతి పెద్దదైన నీటి పారుదల ఎత్తిపోతల పథకం.
సుమారు 45 లక్షల ఎకరాలకు సాగు నీరందించే ఈ ప్రాజెక్టు వల్ల తెలంగాణ సస్యశ్యామలం కాబోతోంది. ఇక దీని సొరంగాల పొడవు 203 కి.మీ. కాగా, ఔటర్ రింగ్ రోడ్ వంటి రహదారి పొడవు 158 కి.మీ.11. 24 కి.మీ. పొడవుతో 535 క్యూసెక్కుల నీటి ప్రవాహం వెళ్లేలా ఎనిమిదో ప్యాకేజీలో రెండు సొరంగాలు (టన్నెళ్లు) నిర్మించారు. కన్నెపల్లి పంప్ హౌస్ వద్ద నుంచి గ్రావిటీ కాలువలో జలాలను ఎత్తిపోసే విధంగా ఒక కిలో మీటర్ వరకు పైపులైన్ నిర్మించారు.
ఇక ఈ మహా భగీరథ ప్రయత్నంలో హోమాలు, పూజలు, క్రతువులకు కొదవలేదు. మేడిగడ్డ, కన్నెపల్లిలో పూజలు, అలాగే అన్నారం బ్యారేజీ పంప్ హౌస్, సుందిళ్ల బ్యారేజీ పంప్ హౌస్ తో బాటు నందిమేడారంలోని ప్యాకేజీ-6 పంప్ హౌస్, రామడుగులోని ప్యాకేజీ-8 పంప్ హౌస్ వద్ద కూడా ప్రత్యేక పూజలు జరిగాయి. ఈ ప్రాజెక్టును 7 లింకులు, 28 ప్యాకేజీలుగా (13 జిల్లాల్లోని 500 కి.మీ. వరకు) నిర్మించారు.

కెనాల్ నెట్ వర్క్ దాదాపు 1800 కి.మీ. దూరం ఉంది. మొత్తం 240 టీఎంసీల నీటిని వినియోగించుకోవాలన్నది లక్ష్యం. ఇందులో16. 9 టీఎంసీలను సేద్యపు నీటి అవసరాలకోసం, 30 టీఎంసీలను హైదరాబాద్, 10 టీఎంసీలను ప్రాజెక్టు చుట్టుపక్కలగల గ్రామాలకు సరఫరా చేయాలన్నది మరో ధ్యేయం. 16 టీఎంసీలను పారిశ్రామిక అవసరాలకు కేటాయిస్తారు. ఈ మహా ప్రాజెక్టును మూడేళ్ళలో పూర్తి కార్యరూపం దాల్చేలా చేసిన సీఎం కేసీఆర్ అపర భగీరథుండంటే అతిశయోక్తి కాదు. ఎప్పటికప్పుడు ఈ ప్రాజెక్టు పనుల పురోగతిని తెలుసుకుంటూ..అధికారులకు తగిన సూచనలు, సలహాలు ఇస్తూ ఆయన తన కలలను సాకారం చేసుకున్నారు. పగలనక, రేయనక ఇంజనీర్లు, సాగునీటి నిపుణులు, అధికారులు ఆయన కృషికి తోడ్పాటునందిస్తూ వచ్చారు