తీగ లాగితే డొంకంతా కదిలినట్లుగా పోలీసులు ఉచ్చు బిగించి కేసు దర్యాప్తు చేస్తుండటంతో తానే హత్య చేశామని ఇద్దరు వ్యక్తులు నేరుగా పోలీస్ స్టేషనుకు వచ్చి లొంగిపోయారు. ఈ హత్య కేసు మిస్టరీ వీడింది. ఖమ్మం జిల్లా కల్లూరు గ్రామంలోని పుల్లపు కుంటలో ఈ నెల 15వ తేదీన గుర్తుతెలియని మహిళా మృతదేహం లభించగా దానిపై కేసు నమోదు చేసి కల్లూరు పోలీసులు విచారణ చేపట్టారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చండ్రుగొండ మండలం, మద్దికూరు గ్రామానికు చెందిన నారాయణపేట నరసమ్మ ( 39 ) అనే మహిళకు కల్లూరుకు చెందిన భూక్య ప్రసాద్‌తో గత కొన్నేళ్లుగా సహజీవనం చేస్తూ ఆ తర్వాత పెళ్లి చేసుకున్నాడు. గతంలో ప్రసాద్‌కి కల్యాణి అనే మహిళతో వివాహం అయ్యింది. విభేదాలు రావడంతో ఇద్దరూ విడిపోయి దూరంగా ఉంటున్నా రు.
అయితే భూక్యా ప్రసాద్ వృత్తి రీత్యా ఎలక్ట్రీషియన్‌గా పని చేస్తుండటంతో ఆంధ్రాకు చెందిన నెల్లూరి మల్లేశ్వరి అనే మరో మహిళతో పరిచయం ఏర్పడింది. దీనితో ఆమెను మూడో పెళ్లి చేసుకున్నాడు.ఈ విషయం మృతురాలు నరసమ్మకు తెలియడంతో ఇరువురి మధ్య గొడవలు జరిగాయి. ఎలాగైనా నరసమ్మను వదిలించుకోవాలని భూక్యా ప్రసాద్, మల్లీశ్వరిలు హత్య చేసేందుకు పథకం వేశారు. ఈ పథకం ప్రకారం ఈ నెల 15 న కల్లూరు పుల్లపు కుంట చెరువు సమీపంలో నరసమ్మను హత్య చేసి మృతదేహాన్ని చెరువులో పడేశారు. నరసమ్మ మృతదేహం పూర్తిగా కుళ్లిపోయి, ఎముకల గూడుగా పోలీసులకు లభ్యమైంది. దీంతో కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. పోలీసుల విచారణ గ్రామంలో ముమ్మరంగా సాగడంతో ఎలాగైనా పోలీసులకు దొరికిపోతామని భయంతో నేరుగా పోలీస్ స్టేషన్‌కు వచ్చి తానే నరసమ్మను హత్య చేశామని భూక్యా ప్రసాద్, మల్లీశ్వరి నేరాన్ని అంగీకరిస్తూ లొంగిపోయారని కల్లూరు ఏసీపీ రఘు మీడియా సమావేశంలో వెల్లడించారు. నిందితులను అరెస్టు చేసి కోర్టుకు హాజరుపరిచారు.