
Amrabad Tigers: అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ మరోసారి తన సత్తా చాటింది. దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్న అఖిల భారత పులుల అంచనా (AITE-2026) ప్రాథమిక సర్వేలో అమ్రాబాద్ అటవీ ప్రాంతంలో మొత్తం 42 పులుల ఆనవాళ్లు నమోదయ్యాయి. వీటిలో 18 ఆడ పులులు, 14 మగ పులులు, 2 సబ్ అడల్ట్ పులులు, 8 పులి పిల్లలు (కబ్స్) ఉన్నట్లు ప్రాథమిక విశ్లేషణలో వెల్లడైంది. దీంతో తెలంగాణలో పులుల సంరక్షణ చర్యలు ఫలిస్తున్నాయనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
గత నవంబర్ 2025 నుంచి జూన్ 2026 వరకు దశలవారీగా సర్వే నిర్వహించారు. రిజర్వ్ ప్రాంతాన్ని 11×11 కిలోమీటర్ల గ్రిడ్‌లుగా విభజించి, ప్రతి గ్రిడ్‌లో కెమెరా ట్రాప్‌లు ఏర్పాటు చేశారు. మొత్తం 2 వేలకుపైగా కెమెరా ట్రాప్‌లు అమర్చి పులుల కదలికలను రికార్డు చేసినట్లు అటవీశాఖ అధికారులు తెలిపారు. సేకరించిన ఫొటోలు, వీడియోలు, పాదముద్రలు, ఇతర శాస్త్రీయ ఆధారాల ఆధారంగా ఈ ప్రాథమిక గణాంకాలు సిద్ధం చేసినట్లు వెల్లడించారు. పులులతో పాటు ఇతర వన్యప్రాణుల సంచారాన్ని కూడా ఈ సర్వేలో నమోదు చేశారు. సుదూర అటవీ ప్రాంతాల్లో కెమెరాలు ఏర్పాటు చేయడం, వాటి నిర్వహణ, డేటా సేకరణ వంటి ప్రక్రియల్లో అటవీ సిబ్బంది, నిపుణులు కీలక పాత్ర పోషించారు. ఈ సర్వే తుది నివేదిక వెలువడిన తర్వాత అమ్రాబాద్‌లో పులుల సంఖ్యపై అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది.
పులుల సంరక్షణకు ఎలాంటి ఆటంకం కలగకుండా ఉండేందుకు జూలై 1 నుంచి సెప్టెంబర్ 30 వరకు అమ్రాబాద్ టైగర్ రిజర్వ్‌ను పర్యాటకులకు మూసివేయనున్నట్లు అధికారులు ఇప్పటికే ప్రకటించారు. వర్షాకాలంలో అటవీ పునరుత్పత్తి, వన్యప్రాణుల సంరక్షణ, పులుల సంచారానికి అనుకూల వాతావరణం కల్పించడమే ఈ నిర్ణయం వెనుక ప్రధాన ఉద్దేశమని అటవీశాఖ తెలిపింది.
ఇది కూడా చదవండి: Gold Rates: బంగారం, వెండి ధరలు ఎందుకు తగ్గుతున్నాయి..? నగలు కొనేటప్పుడు ఈ విషయాలు మర్చిపోవద్దు
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి