కుక్కర్లు అమ్మేవారిలా వచ్చి కోట్ల చోరీలు.. ఆదిలాబాద్‌లో పట్టుబడ్డ అంతర్జాతీయ దొంగల ముఠా
Adilabad burglary case: ఆదిలాబాద్‌లో కాంగ్రెస్ నేత కంది శ్రీనివాస్ రెడ్డి ఇంట్లో జరిగిన భారీ చోరీ కేసును పోలీసులు 48 గంటల్లోనే ఛేదించారు. ఈ కేసులో ఇద్దరు బంగ్లాదేశ్ వాసులు, ఒక భారతీయుడిని అరెస్ట్ చేసి బంగారం, వెండి, నగదు, ఎలక్ట్రానిక్ వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. దేశవ్యాప్తంగా చోరీలకు పాల్పడిన అంతర్జాతీయ ముఠా గుట్టును పోలీసులు బయటపెట్టారు.

ఆదిలాబాద్ జిల్లా పోలీసులు శభాష్ అనిపించుకున్నారు. జిల్లాకు చెందిన ఓ అధికార పార్టీ కీలక నేత ఇంట్లో చోరీ కేసును నాలుగు రోజుల్లో ఛేదించారు. ఈ కేసులో నిందితులుగా ఉన్న దొంగల వివరాలు తెలుసుకుని షాక్‌కు గురయ్యారు. ఈ దొంగలు మాములు దొంగలు కాదు.. ఏకంగా దేశ సరిహద్దులు దాటి అక్రమంగా భారతదేశంలోకి చొరబడిన అంతర్జాతీయ స్థాయి ఘరానా దొంగలు. ఈ ముఠా గుట్టును రట్టు చేస్తూ సంచలన కేసును ఛేదించారు ఆదిలాబాద్ జిల్లా పోలీసులు.
వివరాల్లోకి వెళితే.. ఆదిలాబాద్ జిల్లా మావల పోలీస్ స్టేషన్ పరిధిలోని కైలాష్ నగర్‌లో నివాసం ఉంటున్న ఆదిలాబాద్ నియోజక వర్గ కాంగ్రెస్ ఇంఛార్జ్ కంది శ్రీనివాస్ రెడ్డి ఇంట్లో గత నెల 30న భారీ చోరీ జరిగింది. ఫిర్యాదు అందడంతో రంగంలోకి దిగిన పోలీసులు కేసును లోతుగా దర్యాప్తు చేపట్టారు. సీసీ పుటేజ్ ఆధారంగా కీలక ఆధారాలు రాబట్టిన పోలీసులు.. కేవలం 48 గంటల్లోనే నిందితుల ఆచూకీ గుర్తించారు. అయితే ఆ దొంగలు మాములు దొంగలు కాదని అంతర్జాతీయ స్థాయిలో చోరీలకు పాల్పడిన గజదొంగలని తేల్చారు. ఈ కేసులో ఇద్దరు బంగ్లాదేశ్ వాసులు, ఒక భారతీయ నిందితుడిని అరెస్ట్ చేసినట్లు జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ వెల్లడించారు. నిందితుల నుంచి రూ. 8 లక్షల విలువైన 73.05 గ్రాముల బంగారం, 151.30 గ్రాముల వెండి, నగదుతో పాటు ఐఫోన్లు, ఐప్యాడ్‌లు , ఒక ద్విచక్ర వాహనాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
ప్రధాన నిందితుడు మొహమ్మద్ జౌనీ అలీ అలియాస్ జానీ అలీతో పాటు అతని సోదరుడు మొహమ్మద్ రుమాన్ అలీ బంగ్లాదేశ్‌కు చెందినవారు కాగా, వారికి మధ్యప్రదేశ్‌కు చెందిన తరుణ్ సింగ్ సహకరించేవాడు. వీరు పగటిపూట కాలనీల్లో ప్రెజర్ కుక్కర్లు, మిక్సీ గ్రైండర్లు అమ్మే వ్యాపారుల అవతారం ఎత్తి ఇళ్లను పక్కాగా రెక్కీ నిర్వహించేవారు. రాత్రి వేళల్లో తాళాలు వేసి ఉన్న ఇళ్లే లక్ష్యంగా పారలతో తాళాలు పగులగొట్టి క్షణాల్లో దోపిడీలకు పాల్పడేవారు.
దర్యాప్తులో వెలుగుచూసిన అత్యంత దిగ్భ్రాంతికర విషయం ఏమిటంటే.. ప్రధాన నిందితుడు జౌనీ అలీ గత 9 ఏళ్లలో దాదాపు 10 నుంచి 12 సార్లు సరిహద్దు దళాల కళ్లుగప్పి అక్రమంగా బంగ్లాదేశ్ నుంచి భారత్‌లోకి ప్రవేశించాడు. ఇక్కడ నకిలీ పత్రాలతో ఆధార్ కార్డులను కూడా సృష్టించుకుని రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్ర, తెలంగాణ, ఒడిశా, కర్ణాటక వంటి దాదాపు ఏడు రాష్ట్రాల్లో వరుస చోరీలకు పాల్పడ్డాడు. దొంగిలించిన సొమ్ముతో తిరిగి బంగ్లాదేశ్ వెళ్లి తలదాచుకునేవాడని, ఇతనిపై దేశవ్యాప్తంగా 8కి పైగా తీవ్రమైన క్రిమినల్ కేసులు నమోదై ఉన్నాయని ఎస్పీ వివరించారు.
ఇటీవల జూలై 11న మళ్లీ అక్రమంగా దేశంలోకి చొరబడిన ఈ గ్యాంగ్.. మధ్యప్రదేశ్, మహారాష్ట్రల్లో చోరీలకు పాల్పడుతూ ఆదిలాబాద్ చేరుకుంది. మావలలోని కైలాష్‌నగర్‌లో హస్తలాఘవం ప్రదర్శించిన అనంతరం పారిపోతుండగా, జిల్లా సీసీటీవీ నెట్‌వర్క్, సాంకేతిక ఆధారాలు, సైబర్ క్రైమ్ విభాగాల సమన్వయంతో మావల సీఐ ప్రేమ్ కుమార్ బృందం అత్యంత చాకచక్యంగా వీరిని ఛత్రపతి శంభాజీనగర్ వైపు ట్రాక్ చేసి పట్టుకుంది. ఈ ముఠాతో సంబంధాలున్న మరో 12 నుండి 15 మంది బంగ్లాదేశీ మూలాలున్న నేరస్థుల నెట్‌వర్క్‌ను ఛేదించేందుకు ఇతర రాష్ట్రాల పోలీసులతో ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు.
దేశ భద్రతకే సవాలుగా మారిన ఇలాంటి అక్రమ చొరబాటుదారులు, నకిలీ గుర్తింపు కార్డులు సమకూర్చే దళారులపై కఠిన చట్టాల కింద చర్యలు తీసుకుంటామని ఎస్పీ అఖిల్ మహాజన్ హెచ్చరించారు. కష్టతరమైన ఈ అంతర్జాతీయ కేసును అతి తక్కువ సమయంలో ఛేదించిన మావల సీఐ ప్రేమ్ కుమార్, సైబర్ క్రైమ్ ఎస్ఐ గోపికృష్ణ , త్రిశూల్ క్రైమ్ సిబ్బందిని ఎస్పీ ప్రత్యేకంగా అభినందించి రివార్డులను అందజేశారు.
