Sai Durgha Tej: ‘ఇలాంటి సమాజంలో ఉన్నామా..?’ సాయితేజ్‌ పోస్ట్‌పై స్పందించిన సీఎం, డిప్యూటీ సీఎం

|

Jul 07, 2024 | 8:31 PM

పసి పిల్లలపై కూడా సోషల్ మీడియా రక్కసి కోరలు చాస్తోంది. తండ్రీకూతుళ్ల ఆత్మీయ బంధాన్ని అవమానించేలా వికృత చేష్టలకు దిగుతున్నారు కొందరు నీచులు. ఈ సోషల్ మీడియాలో ఉన్న మృగాల నుంచి పిల్లలను కాపాడుకోవాలంటూ పేరెంట్స్‌కి విజ్ఞప్తి చేశారు హీరో సాయి దుర్గ తేజ్‌. ఈ పోస్టుపై సీఎం రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క స్పందించారు.

Sai Durgha Tej: ఇలాంటి సమాజంలో ఉన్నామా..? సాయితేజ్‌ పోస్ట్‌పై స్పందించిన సీఎం, డిప్యూటీ సీఎం
Actor Sai Durgha Tej
Follow us on

సోషల్ మీడియాలో పోస్టులకు, కామెంట్స్‌కు హద్దు లేకుండా పోతోంది. స్వేచ్ఛ, వాక్ స్వాతంత్య్రం పేరుతో ఇష్టమొచ్చినట్లుగా బిహేవ్ చేస్తున్నారు శాడిస్టులు. సెలబ్రెటీలు, సామాన్యులు అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరిపై బూతులు, నెగెటివ్ కామెంట్లు, డబుల్ మీనింగ్ డైలాగులతో రెచ్చిపోతున్నారు. చివరికి తండ్రీ బిడ్డలను కూడా వదలడం లేదు సోషల్‌ మీడియా సైకోలు. తండ్రి బిడ్డల ఆటపై కూడా డబుల్ మీనింగ్ ట్రోల్స్, మీమ్స్ క్రియేట్ చేస్తున్నారు కొందరు నీచులు.

 

సోషల్‌ మీడియా అకృత్యాలకి అడ్డు అదుపే లేకుండా పోతుందనడానికి వీళ్లు చేసిన కామెంట్లే నిదర్శనం. కొంతమంది యూట్యూబర్స్‌ తండ్రీకూతుర్ల బంధంపై అసభ్య కామెంట్లు చేశారు. డార్క్‌ కామెడీ పేరుతో విచ్చలవిడిగా మాట్లాడారు. ఆత్మీయ బంధాన్ని అవమానించేలా వికృత చేష్టలకు దిగారు. తండ్రీకూతుర్ల బంధాన్ని చెడు కోణంలో చూపిస్తూ వారి గురించి అత్యంత అసభ్యంగా మాట్లాడారు. దీంతో ఈ వీడియో కాంట్రావ‌ర్సీగా మారింది.

దీనిపై హీరో సాయి దుర్గా తేజ్‌ ఘాటుగా రియాక్ట్ అయ్యారు. సోషల్ మీడియాలో ఉండే మృగాల నుంచి పిల్లలని కాపాడుకోవాలంటూ తల్లిదండ్రులకి విజ్ఞప్తి చేశారు. సోషల్‌ మీడియాలో పిల్లల ఫోటోలు, వీడియోలు షేర్‌ చేసే పేరెంట్స్‌ తస్మాత్‌ జాగ్రత్త అంటూ హెచ్చరించారు. సోషల్ మీడియా క్రూరంగా, అసహ్యంగా, భయానకంగా మారిపోయాయని ఆందోళన వ్యక్తం చేశారు. కొన్ని మానవ మృగాలకు తల్లిదండ్రుల బాధ అర్థం కాదన్నారు. సోషల్ మీడియాలో చిన్న పిల్లల భద్రతపై ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలంటూ… తెలుగు రాష్ట్రాల సీఎంలు, డిప్యూటీ సీఎంలు, మంత్రి నారా లోకేష్‌ను ట్యాగ్ చేస్తూ పోస్టు పెట్టారు.

సాయి దుర్గా తేజ్‌ పోస్ట్‌పై సీఎం రేవంత్‌రెడ్డి స్పందించారు. తమ ప్రభుత్వం పిల్లల భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని… ఈ ఘటనను పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటామని సీఎం రేవంత్‌ రెడ్డి తెలిపారు. ఈ పోస్టుపై ఇటు తెలంగాణ డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క కూడా స్పందించారు. ఈ క్లిష్టమైన సమస్యను లేవనెత్తినందుకు సాయి దుర్గా తేజ్‌ కు ధన్యవాదాలు తెలిపారు. పిల్లల భద్రత నిజానికి అత్యంత ప్రాధాన్యత అంశం అన్నారు. సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో పిల్లల ఫొటోలు, వీడియోలు దుర్వినియోగాన్ని నిరోధించడానికి తెలంగాణ ప్రభుత్వం అవసరమైన చర్యలు తీసుకుంటుందని హామీ ఇచ్చారు. మన పిల్లలకు సురక్షితమైన ఆన్‌లైన్ వాతావరణాన్ని సృష్టించడానికి కలిసి పనిచేద్దామని ఆయన అన్నారు. సోషల్‌ మీడియా రాక్షసులు సమాజానికి ప్రమాదం. రోత రాతల సోషల్‌ మీడియా శాడిస్టులను కటకటాల్లోకి తోయాలి.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..