Achampet area Hospital: నాగర్‌కర్నూల్ జిల్లా(Nagarkurnool District) అచ్చంపేట ఆస్పత్రి ఘటనలో ఇద్దరు వైద్యులపై సస్పెన్షన్ వేటు పడింది. కోవిడ్ పాజిటివ్(Corona Positive) తో అచ్చంపేట కమ్యూనిటీ హెల్త్ కేర్ సెంటర్ కి వచ్చిన మహిళకు ప్రసవం చేయడానికి నిరాకరించారు డాక్టర్లు. దీంతో ఆస్పత్రి గేట్ వద్దే ఆమె ప్రసవించింది. ఈ ఘటనపై అధికార యంత్రాంగం సీరియస్ అయ్యింది. సూపరింటెండెంట్ కృష్ణ, డ్యూటీ డాక్టర్ హరిబాబును సస్పెండ్ చేస్తూ వైద్య విధాన పరిషత్ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఘటనపై పూర్తి స్థాయి విచారణ జరిపి రిపోర్ట్ ఇవ్వాలని నాగర్ కర్నూల్ జిల్లా ఆసుపత్రి సూపరింటెండెంట్ కి ఆదేశాలు ఇచ్చారు. వివరాల్లోకి వెళ్తే.. జిల్లాలోని బల్మూరు మండలం బాణాలకు చెందిన నిమ్మల లాలమ్మకు మంగళవారం ఉదయం 8 గంటల సమయంలో పురిటి నొప్పులు రావడంతో కుటుంబ సభ్యులు అచ్చంపేట ఏరియా ఆస్పత్రికి తీసుకొచ్చారు. ఆమెకు 10 గంటలకు కోవిడ్ టెస్ట్ చేయించగా, పాజిటివ్ వచ్చింది. దీంతో డాక్టర్లు ప్రసవం ఇక్కడ చేయలేమని.. పీపీఈ కిట్స్(PPE Kits)కూడా లేవని చెప్పారు. అప్పటికే ఆ మహిళకు నొప్పులు ఎక్కువ కావడంతో నాగర్‌కర్నూల్ జిల్లా ఆస్పత్రికి వెళ్లాలని విధుల్లో ఉన్న డాక్టర్ హరిబాబు సూచించారు. అప్పటికే నొప్పులు ఎక్కువ అవడంతో ఆస్పత్రి గేటు వద్ద మూలకు తీసుకెళ్లగా అక్కడే ప్రసవించింది. ఆ తర్వాత మేలుకున్న సిబ్బంది బిడ్డను, తల్లిని ఆస్పత్రిలోకి తీసుకువెళ్లారు. ఈ విషయమై ఆస్పత్రి అధికారులు స్పందిస్తూ.. డ్యూటీ డాక్టర్ హరిబాబు బాధితురాలిని జిల్లా ఆస్పత్రికి రెఫర్ చేశారని, వారే వెళ్లలేదన్నారు.
ఘటన వివరాలు తెలుసుకున్న వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. డ్యూటీ డాక్టర్‌పై చర్యలు తీసుకోవాల్సిందిగా అధికారులను ఆదేశించారు. ఇద్దరు వైద్యులను సస్పెన్షన్ చేసిన వైద్య విధాన పరిషత్ .. మొత్తం ఘటనపై నివేదిక ఇవ్వాలని నాగర్‌కర్నూల్ జిల్లా ఆస్పత్రి సూపరింటెండెంట్‌ను ఆదేశించింది. కాగా గర్భిణీలకు కొవిడ్ సోకినా, ప్రసవం కోసం వచ్చిన వారికి ఎట్టి పరిస్థితుల్లోనూ వైద్యం నిరాకరించవద్దని, అందుకు అవసరమైన అన్ని రకాల ఏర్పాట్లు చేసుకోవాలని వైద్యారోగ్యశాఖ మంత్రి హారీశ్‌రావు ఇటీవలే ఆదేశించారు.
Also Read: తాట తీయండి.. డ్రగ్స్ కేసుల్లో ఎంతటివారైనా ఉపేక్షించకండి.. సీఎం కేసీఆర్ సంచలన ఆదేశాలు..