AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hyderabad: షార్ట్ ఫిలిం నటి కేసులో బిగ్ ట్విస్ట్.. బెయిల్‌పై వచ్చిన నిందితుడు ఊహించని విధంగా..

అమ్మాయి ఆత్మహత్య కేసులో అరెస్టయ్యాడు.. జైలు జీవితం గడిపి బెయిల్‌పై బయటకు వచ్చాడు.. అంతా సద్దుమణిగిందనుకునే లోపే ఊహించని విషాదం చోటుచేసుకుంది. హైదరాబాద్ సైదాబాద్‌ను కుదిపేసిన షార్ట్‌ఫిల్మ్ నటి అమూల్య శ్రీ ఆత్మహత్య కేసు ఇప్పుడు మరో మలుపు తిరిగింది. ఆ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న 19 ఏళ్ల మహేష్ అనుమానాస్పద స్థితిలో ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడటం స్థానికంగా తీవ్ర కలకలం రేపుతోంది.

Hyderabad: షార్ట్ ఫిలిం నటి కేసులో బిగ్ ట్విస్ట్.. బెయిల్‌పై వచ్చిన నిందితుడు ఊహించని విధంగా..
Twist In Saidabad Amulya Sri Case
Noor Mohammed Shaik
| Edited By: |

Updated on: Sep 01, 2026 | 7:55 PM

Share

హైదరాబాద్ సైదాబాద్‌లోని సింగరేణి కాలనీలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. కొద్ది నెలల క్రితం కలకలం రేపిన షార్ట్‌ఫిల్మ్ నటి అమూల్య శ్రీ ఆత్మహత్య కేసు మరో అనూహ్య మలుపు తిరిగింది. ఆ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న 19 ఏళ్ల యువకుడు మేఘావత్ నారాయణ అలియాస్ మహేష్ తన ఇంట్లోనే ఉరివేసుకుని ప్రాణాలు తీసుకున్నాడు. బెయిల్‌పై జైలు నుంచి బయటకు వచ్చిన కొద్దిరోజులకే నిందితుడు ఆత్మహత్యకు పాల్పడటం స్థానికంగా తీవ్ర సంచలనం సృష్టిస్తోంది. సింగరేణి కాలనీకి చెందిన మహేష్ ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. కుటుంబ సభ్యులు గమనించి వెంటనే స్థానిక పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న సైదాబాద్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు.

అమూల్య శ్రీ కేసు నుంచి తాజా ఘటన వరకు..

సుమారు మూడు నెలల క్రితం సింగరేణి కాలనీలోనే షార్ట్‌ఫిల్మ్ నటి అమూల్య శ్రీ అనుమానాస్పద స్థితిలో ఆత్మహత్య చేసుకుంది. ఆ కేసులో మహేష్‌ను నిందితుడిగా పేర్కొంటూ సైదాబాద్ పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. కొంతకాలం చంచల్‌గూడ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న మహేష్, ఇటీవల న్యాయస్థానం నుంచి బెయిల్ పొంది బయటకు వచ్చాడు. అయితే విడుదలైన కొద్దిరోజులకే అతడు బలవన్మరణానికి పాల్పడటం అనేక అనుమానాలకు దారితీస్తోంది.

తప్పుడు కేసు పెట్టారంటూ కుటుంబ సభ్యుల ఆరోపణలు

మహేష్‌పై కావాలనే తప్పుడు కేసు బనాయించి జైలుకు పంపించారని అతడి కుటుంబ సభ్యులు తీవ్రంగా ఆరోపిస్తున్నారు. అమాయకుడైన తమ కుమారుడిపై కేసు నమోదు చేసి జైలు జీవితం గడిపేలా చేయడంతో తీవ్ర మనస్తాపానికి గురయ్యాడని.. సమాజంలో తలెత్తుకోలేక ఆత్మహత్య చేసుకున్నాడని కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు.

పోలీసుల దర్యాప్తు ముమ్మరం

మహేష్ మృతిపై సైదాబాద్ పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. సంఘటనా స్థలంలో క్లూస్ టీమ్ ద్వారా ఆధారాలు సేకరించారు. మహేష్ మొబైల్ ఫోన్ డేటా, కాల్ లాగ్స్‌ను విశ్లేషిస్తున్నారు. బెయిల్‌పై వచ్చిన తర్వాత అతడిని ఎవరైనా బెదిరించారా? లేదా కేసు విచారణ తాలూకు భయంతో తీవ్ర నిర్ణయం తీసుకున్నాడా? అనే కోణాల్లో పోలీసులు ఆరా తీస్తున్నారు. కాగా ఆత్మహత్య కేసులో నిందితుడిగా ఉన్న మరో యువకుడు కూడా తనువు చాలించడంతో సింగరేణి కాలనీలో తీవ్ర ఉద్రిక్తత, విషాద ఛాయలు అలుముకున్నాయి. మహేష్ మరణం వెనుక అసలు నిజాలేమిటో పోలీసుల పూర్తిస్థాయి విచారణలో వెల్లడి కావాల్సి ఉంది.

Follow Us