Hyderabad: కాలేజీలో దాండియా ఈవెంట్లో ప్రమాదం.. ఒకరు మృతి
Hyderabad: కళాశాలలో దాండియా వేడుకల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఇందులో భాగంగా విద్యార్థినులు, విద్యార్థులకు వేర్వేరుగా ప్రదేశాలను కేటాయించారు. అయితే వేడుకలు కొనసాగుతున్న సమయంలో ఒక్కసారిగా బలమైన ఈదురుగాలులు వీయడంతో లైటింగ్ ఏర్పాటు చేసిన క్రేన్ అదుపుతప్పి విద్యార్థినులు ఉన్న..

Hyderabad: హైదరాబాద్లోని నాదర్గుల్లో ఉన్న ఎంవీఎస్ఆర్ ఇంజినీరింగ్ కళాశాలలో దాండియా వేడుకల సందర్భంగా ప్రమాదం చోటుచేసుకుంది. వేడుకలు జరుగుతున్న సమయంలో ఒక్కసారిగా ఈదురుగాలులు వీయడంతో ఈవెంట్ కోసం ఏర్పాటు చేసిన లైటింగ్ క్రేన్ కూలిపోయింది. ఈ ఘటనలో ఒకర మృతి చెందగా, 12 మందికి పైగా విద్యార్థులు గాయపడినట్లు సమాచారం.
కళాశాలలో దాండియా వేడుకల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఇందులో భాగంగా విద్యార్థినులు, విద్యార్థులకు వేర్వేరుగా ప్రదేశాలను కేటాయించారు. అయితే వేడుకలు కొనసాగుతున్న సమయంలో ఒక్కసారిగా బలమైన ఈదురుగాలులు వీయడంతో లైటింగ్ ఏర్పాటు చేసిన క్రేన్ అదుపుతప్పి విద్యార్థినులు ఉన్న వైపు కూలిపోయింది. దీంతో అక్కడ ఉన్న పలువురు విద్యార్థినులు గాయపడినట్లు తెలుస్తోంది.
క్షతగాత్రులకు ఆస్పత్రుల్లో చికిత్స
ప్రమాదం జరిగిన వెంటనే స్పందించిన నిర్వాహకులు, ఇతరులు గాయపడిన విద్యార్థులను చికిత్స కోసం సమీపంలోని ఓ ఆస్పత్రికి తరలించారు. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. దీంతో మెరుగైన వైద్యం అందించేందుకు వారిని ఇతర ఆస్పత్రులకు తరలించినట్లు తెలిసింది.
సీఎం రేవంత్రెడ్డి దిగ్భ్రాంతి:
నాదర్గుల్ ఘటనపై సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. ప్రమాదంలో యువతి మృతిచెందడం బాధాకరమని అన్నారు. బాధితులకు ప్రభుత్వం అండగా ఉంటుందని, గాయాలైనవారికి మెరుగైన వైద్యం అందించాలని అధికారులకు సూచించారు. బాధ్యతులపై చర్యలు తీసుకోవాలని సీఎం రేవంత్ అధికారులను ఆదేశించారు.
