ABVP: తెలంగాణ విద్యారంగ సమస్యలపై శంఖారావం పూరించిన ఎబీవీపీ.. భారీ బహిరంగ సభ ఏర్పాటు

Hyderabad News: తెలంగాణలో విద్యారంగ సమస్యలపై అఖిలభారత విద్యార్థి పరిషత్ నేతలు, విద్యార్థులు కదం తొక్కారు. దగాపడ్డా తెలంగాణ విద్యార్థి మార్పు కోసం మరో ఉద్యమం అంటూ పరేడ్ గ్రౌండ్‎లో కదనభేరి పేరుతో భారీ బహిరంగ సభ నిర్వహించారు. కేసీఆర్ సర్కార్‎ను గద్దె దించడమే లక్ష్యంగా ఏబీవీపీ పని చేస్తుందని.. విద్యార్థుల సమస్యలపై పోరాటం మరింత ఉద్ధృతం చేస్తామని ఏబీవీపీ జాతీయ, రాష్ట్ర నాయకులు స్పష్టం చేశారు.

ABVP: తెలంగాణ విద్యారంగ సమస్యలపై శంఖారావం పూరించిన ఎబీవీపీ.. భారీ బహిరంగ సభ ఏర్పాటు
Abvp Flags

Edited By: Aravind B

Updated on: Aug 01, 2023 | 8:12 PM

హైదరాబాద్, ఆగస్టు 1:  తెలంగాణలో విద్యారంగ సమస్యలపై అఖిలభారత విద్యార్థి పరిషత్ నేతలు, విద్యార్థులు కదం తొక్కారు. దగాపడ్డా తెలంగాణ విద్యార్థి మార్పు కోసం మరో ఉద్యమం అంటూ పరేడ్ గ్రౌండ్‎లో కదనభేరి పేరుతో భారీ బహిరంగ సభ నిర్వహించారు. కేసీఆర్ సర్కార్‎ను గద్దె దించడమే లక్ష్యంగా ఏబీవీపీ పని చేస్తుందని.. విద్యార్థుల సమస్యలపై పోరాటం మరింత ఉద్ధృతం చేస్తామని ఏబీవీపీ జాతీయ, రాష్ట్ర నాయకులు స్పష్టం చేశారు. ఏబీవీపీ ఆర్గనైజేషనల్ జాతీయ సెక్రటరీ ఆశీష్ చౌహాన్, జాతీయ జాయింట్ సెక్రటరీ బాలకృష్ణ, జాతీయ ప్రధాన కార్యదర్శి యాజ్ఞవల్క్య శుక్లా సహా పలువురు ప్రముఖులు ఈ సభకు హాజరయ్యారు. బీజేపీ నేతలు మురళిధర్ రావు, మనోహర్ రెడ్డి, ఈటల రాజేందర్ సహా పలువులు ఈ సభకు హాజరయ్యారు. పదేళ్లలో తెలంగాణ సర్కారు విద్యారంగాన్ని పట్టించుకున్న పాపాన పోలేదని.. సీఎం కేసీఆర్ ప్రగతి భవన్ లో కూర్చొని కుటుంబ ప్రగతిని మాత్రమే సాధించారని ఏబీవీపీ ఆర్గనైజేషనల్ జాతీయ సెక్రటరీ ఆశీష్ చౌహాన్ ఆరోపించారు. రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలల్లో కనీస టాయిలెట్లు లేని దుస్థితి ఉందని.. అధ్యాపకుల నియామకం ఎందుకు చేపట్టట్లేదని ఆయన ప్రశ్నించారు.

తెలంగాణను దోచుకున్న కేసీఆర్.. ఇప్పుడు దేశం మీద పడబోతున్నారని.. కేసీఆర్ పతనం ఈ సభతోనే ఆరంభం అంటు ఆశిష్ మండిపడ్డారు. తెలంగాణలో ఖాళీగా ఉన్న 20 వేల టీచర్ల పోస్టుల భర్తీ వెంటనే చేపట్టాలని ఏబీవీపి రాష్ట్ర కార్యదర్శి ఝాన్సీ డిమాండ్ చేసింది. విద్యార్థుల సమస్యలకు అద్దం పట్టేలా పెద్దఎత్తున తరలివచ్చిన విద్యార్థులే అందుకు నిదర్శనం అన్నారు. లీకేజీ సర్కారు వెంటనే TSPSCని ప్రక్షాళన చేసి లక్షా 91 వేల ఉద్యోగాలను ఫిల్ చేయాలని అన్నారు. బకాయిపడ్డ విద్యార్థులు మెస్ ఛార్జీలు, ఫీజు రీయింబర్స్‎మెంట్ వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. విద్యాలయాలను సమస్యల నిలయంగా మారిన ఈ సర్కారు అవసరం లేదని.. విద్యార్థుల పక్షానా ఉండే ప్రభుత్వాన్ని స్థాపించాలని ఏబీవీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి శుక్లా పిలుపునిచ్చారు. ప్రపంచ దేశాలు భారత్ వైపు చూస్తున్నయని.. తెలంగాణలో మాత్రం అవినీతి రాజ్యం ఏలుతుందని అన్నారు. తెలంగాణ విద్యార్థి లోకం కేసీఆర్ తగిన గుణపాఠం చెబుతుందని అన్నారు.