Telangana Government: తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఇది నిజంగా శుభవార్త అనే చెప్పాలి. కొన్నేళ్లుగా పెండింగ్‌లో ఉన్న పెన్షన్లతో పాటు.. రేషన్ కార్డు దరఖాస్తులు కూడా త్వరలోనే క్లియర్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. నాగార్జునసాగర్ ఎన్నికల సందర్భంగా నిర్వహించిన ప్రచార సభలో ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా.. పెన్షన్లు, రేషన్ కార్డులు జారీ చేస్తామని ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ హామీ మేరకు మరో రెండు నెలలో కొత్త రేషన్ కార్డులు, కొత్త పెన్షన్లు జారీ చేసేందుకు అధికారులు కసరత్తు ప్రారంభించినట్లు తెలుస్తోంది. అలాగే పెన్షన్ పొందే వారి వయసు అర్హతను కూడా తగ్గించనున్నట్లు తెలుస్తోంది. రాష్ట్ర అవతరణ దినోత్సవం అయిన జూన్ 2వ తేదీన వీటిని అమలు చేయనున్నట్లు తెలుస్తోంది. ఇటీవల వరంగల్‌లో పర్యటించిన మంత్రి కేటీఆర్.. పెండింగ్‌లో ఉన్న పెన్షన్లతో పాటు, రేషన్ కార్డులను త్వరలోనే జారీ చేస్తామని ప్రకటించారు. ఈ ప్రకటనతో ఏళ్లుగా ఎదురు చూస్తున్న లబ్ధిదారుల్లో ఆశలు చిగురించాయి.
ఇదిలాఉంటే.. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 39.5లక్షల మంది ఆసరా పెన్షన్ పొందుతున్నారు. వీరిలో వృద్ధాప్య పెన్షన్ పొందుతున్న వారు 13.5 లక్షల మంది ఉన్నారు. అయితే, వృద్ధాప్య పెన్షన్‌కు అర్హత వయస్సును 60 నుంచి 57 ఏళ్లకు తగ్గిస్తామని 2018 అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా సీఎం కేసీఆర్ హామీ ఇచ్చారు. ఆ హామీని నెరవేరుస్తామని ఇటీవల అసెంబ్లీలోనూ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రస్తావించారు. సీఎం హామీ మేరకు అర్హత వయసును తగ్గించినట్లయితే.. కొత్తగా ఎనిమిది లక్షల మంది ఆసరా పెన్షన్ పథకానికి అర్హత పొందుతారు. ఇదిలాఉంటే.. రెండేళ్ల నుంచి రాష్ట్రంలో ఒక్క కొత్త రేషన్ కార్డు కూడా మంజూరు చేయలేదు. రాష్ట్ర వ్యాప్తంగా తొమ్మిది లక్షలకు పైగా రేషన్ కార్డు దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి. ఈ రెండు హామీలన తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం నుంచి అమలు చేసే అవకాశం ఉందని అధికార వర్గాలు చెబుతున్నాయి.
Also read:
బ్యాంకుల బాదుడు… సర్వీసు చార్జీల పేరుతో భారీగా వడ్డీంపు … ఐదేళ్లలో రూ.300 కోట్లు వసూలు చేసిన ఎస్‌బీఐ
Pregnant Athlete: ఎనిమిది నెలల గర్భంతో తైక్వాండో పోటీల్లో గోల్డ్ మెడల్ సాధించిన అథ్లెట్… ( వీడియో )