
తండ్రి కూతురు మధ్య బంధం గురించి ఎంత చెప్పినా తక్కువే..! నాన్నకు పిల్లలు అందరూ ఒక్కటే.. అయితే కూతురు అంటే కొంచెం ఎక్కువ ప్రేమ. తండ్రికి తన కూతురే ప్రాణం.. ఆ కూతురికి నాన్నే ఇలలో నడిచే దైవం.. హీరో.. నవ మాసాలు మోసి జననం ఇవ్వక పోయినా.. తన జన్మకు కారణమైన తండ్రి అంటే కూతురికి పంచప్రాణాలు. చనిపోవడానికి కొన్ని గంటల ముందు తండ్రితో కూతురు చేసిన రీల్ ను చూసి జనం కంటతడి పెడుతున్నారు.
యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలం పులిగిల్ల గ్రామానికి చెందిన చంద్రకళ-ఇస్తారి దంపతుల కూతురు లాస్య. లాస్యను ఎనిమిదేళ్ల క్రితం యాదగిరిగుట్ట మండలం మల్లాపురం గ్రామానికి చెందిన కర్రే అనిల్‌కు ఇచ్చి వివాహం చేశారు. అనిల్ ప్రైవేటు ఉద్యోగం చేస్తుండగా, లాస్య ఇంటి వద్దే ఉంటుంది. వీరికి కుమారుడు, కూతురు ఉన్నారు. లాస్య నిత్యం పరిసరాలు, సామాజిక అంశాలపై రీల్స్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసేది.
అయితే భర్త అనిల్ అయ్యప్ప మాల ధరించి శబరిమలకు వెళ్ళాడు. లాస్య కూతురు పుట్టినరోజు సందర్భంగా తన తల్లిగారి ఇల్లు పులిగిల్లకు వచ్చింది. గ్రామంలోనీ రామలింగేశ్వర స్వామి దేవాలయానికి తన తండ్రి, ఇద్దరు పిల్లలతో కలిసి దేవాలయానికి వెళ్ళింది. మెట్ల మార్గంలో తన తండ్రితో కలిసి స్వామివారిని దర్శించుకునే క్రమంలో.. తండ్రిపై ఉన్న ప్రేమను వ్యక్తీకరిస్తూ రీల్ చేసి సోషల్ మీడియాలో పోస్టు చేసింది. మెట్లు ఎక్కుతూ ఆలయానికి చేరుకుంది. రామలింగేశ్వర స్వామిని దర్శించుకునే క్రమంలో ఆలయం కోనేరులోకి దిగి నీళ్లు చల్లుకుంటుండగా జారిపడి లాస్య మృతి చెందింది.
చనిపోవడానికి కొన్ని గంటల ముందే తండ్రిపై తనకున్న ప్రేమను చాటుకుంది. నాయనా.. నాయనా అంటూ ఇన్‌స్టాలో పోస్ట్ చేసిన రీల్ సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ వీడియోని చూసిన నెటిజన్లు సైతం ప్రతి ఒక్కరూ కంటతడి పెడుతున్నారు. అప్పటి వరకు ఉత్సాహంగా ఉన్న బిడ్డ విగతజీవిగా మారడంతో ఆ తండ్రి తల్లడిల్లిపోయాడు. లాస్య మరణ వార్తతో గ్రామంలో తీవ్ర విషాదఛాయలు అలుముకున్నాయి.
వీడియో ఇక్కడ చూడండి..
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..