సాధారణంగా దొంగలు.. దొంగతనాలు చేసి పోలీసుల కంటపడకుండా తమ స్థావరానికి చేరుకుంటారు. ఈ దొంగ మాత్రం అత్తగారింట్లో ఉంటూ దేవాలయాలు చోరీకి పాల్పడుతూ పోలీసులకు చిక్కకుండా ఉంటున్నాడు. అల్లుడుగా పగటిపూట దర్జాగా ఇంట్లో ఉంటూ.. రాత్రిపూట దొంగతనాలు చేస్తూ అత్తగారింటినీ డెన్‌గా మార్చుకున్నాడు. అత్తగారింటినీ డెన్‌గా మార్చుకొని దొంగతనాలు చేస్తున్న ఆ దొంగ ఎవరో తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే..
ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం రాజీవ్‌కాలనీకి చెందిన బీ మంజీతసింగ్.. నల్లగొండ జిల్లా మిర్యాలగూడ పట్టణంలో చెందిన యువతిని పెళ్లి చేసుకున్నాడు. పండ్ల వ్యాపారం చేస్తూనే దొంగతనం కూడా చేస్తుంటాడు. తరచూ మంజిత్ సింగ్ మిర్యాలగూడలోని అత్తగారి ఇంటికి వస్తూ ఉండేవాడు. అల్లుడు కావడంతో మంజిత్ సింగ్ మర్యాదలు చేస్తున్నారు. అప్పుడప్పుడు పగటిపూట పట్నంలో తిరిగి వచ్చేవాడు. పగటిపూట అత్తగారింట్లో ఉంటూ రాచ మర్యాదలు పొందుతూ రాత్రిపూట తన పనిని కానీస్తున్నాడు. మిర్యాలగూడ పట్టణంతో పాటు పరిసర ప్రాంతాల్లోని దేవాలయాల్లో కొంతకాలంగా దొంగతనాలు జరుగుతున్నాయి. ఆగస్టులో యాద్గార్‌పల్లిలోని శ్రీపార్వతి సమేత ఆగస్తేశ్వరస్వామి దేవాలయం తాళం పగులగొట్టి అమ్మవారికి చెందిన 4 పట్టుచీరలు, తాజాగా రామలింగేశ్వరస్వామి దేవాలయంలో చోరీకి పాల్పడ్డాడు.
పార్వతీసమేత రామలింగేశ్వర ఆలయంలో చోరీ జరిపేందుకు నిందితుడు 15రోజులుగా ప్రయత్నించి ఈ నెల 6న పధకం ప్రకారం మూడు పంచలోహ విగ్రహాలు, శఠగోపురం, అమ్మవారి బంగారు పుస్తెలను కొట్టేశాడు. ఆలయాల్లో చోరీ కేసులను సవాల్‌గా తీసుకున్న పోలీసులు మిర్యాలగూడ పట్టణ పరిసర ప్రాంతాల నుంచి రాకపోకలు, దేవాలయాలకు సంబంధించిన సీసీ ఫుటేజీని పోలీసులు పరిశీలించారు. దీంతో ఆలగడప టోల్ ప్లాజా వద్ద వాహనాల తనిఖీ చేస్తుండగా మంజీత్ సింగ్ దొరికాడని పోలీసులు చెబుతున్నారు. దేవాలయాల్లో దొంగిలించిన విగ్రహాలను పండ్లపెట్టేలో ఉంచి బస్తాలో మూటకట్టి మోపెడ్‌తో పారిపోతున్న మంజీత్ సింగ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకొని విచారించారు. ఆలయాల్లో దొంగతనాలకు పాల్పడినట్లు నేరాన్ని అంగీకరించినట్లు పోలీసులు చెబుతున్నారు. నిందితుల నుండి మోపెడ్‌తోపాటు దొంగిలించిన పార్వతి పరమేశ్వరుడు, చండీశ్వరుడు పంచలోహ విగ్రహాలతోపాటు మూలవిరాట్ శఠగోపురం, 4 గ్రాముల బంగారు రెండు పుస్తెలను స్వాధీనం చేసుకున్నట్లు మిర్యాలగూడ డీఎస్పీ రాజశేఖర్ రాజు తెలిపారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి