కరీంనగర్ సమీపంలోని ఆరేపల్లి గ్రామంలో తొంభై శాతానికి పైగా ప్రజలు వ్యవసాయం చేస్తూ జీవిస్తారు. ఇక్కడ కుమ్మరి వృత్తిని నమ్ముకొని జీవిస్తున్న వారి సంఖ్య కూడ ఎక్కువగానే ఉంది. సుమారుగా ముఫ్ఫై కుటుంబాలు ఈ వృత్తినే నమ్ముకున్నారు. దీపావళి వస్తే చాలు.. ఈ గ్రామంలో ప్రమిదల తయారీలో కళాకారులు బిజిగా ఉంటారు. నెల రోజుల నుండే రోజుకు పన్నెండు గంటల పాటు శ్రమించి ప్రమిదలు తయారు చేస్తున్నారు. వివిధ ప్రాంతాల నుండి నాణ్యమైన మట్టిని తీసుకువచ్చి రెండురోజుల పాటు నానబెట్టిన తరువాత కాస్తా బురదగా మార్చి ప్రమిదలు తయారు చేస్తున్నారు. వివిధ రకాల ప్రమిదల ఆకారాలు తీర్చిదిద్దుతున్నారు.
తెలంగాణలో ఈ కులవృత్తి తగ్గతూ వస్తుంది. అరేపల్లి లోమాత్రం ఎన్ని ఇబ్బందులు ఉన్నప్పటికి ఈ వృత్తిని నమ్ముకొని మట్టిపాత్రలు తయారు చేస్తున్నారు. ముఖ్యంగా ప్రమిదల తయారీలో వీరి నైపుణ్యం కనబడుతుంది. ఒక్కో కళాకారుడు ప్రతిరోజు మూడువేలకి పైగానే ప్రమిదలు తయారు చేస్తున్నారు. ఎలాంటి మిషన్లు ఉపయోగించకుండా పూర్తిగా చేతి ఆధారంగానే డిజైన్లు రూపొందిస్తున్నారు. వివిధ ప్రాంతాల నుండి వ్యాపారస్తులు ఇక్కడికి వచ్చి కొనుగోలు చేస్తున్నారు. అంతేకాకుండా కస్టమర్‌కి కూడా నేరుగా ప్రమిదలు కొనుగోలు చేస్తున్నారు. దీపావళి పండుగ వస్తే చాలు ఈ గ్రామంలో కోలాహలం కనబడుతుంది. చాలా ఏండ్లగా ఈ వృత్తిని నమ్ముకొని జీవిస్తున్నామని కళాకారులు చెబుతున్నారు.