హైదరాబాద్ మహానగరంలో వెరైటీ దొంగల బండారం బయటపడింది. ఉదయం.. దర్జాగా నటించి, రాత్రి అయితే చాలు, చటుక్కున మాయం చేస్తున్నారు. పక్కా స్కెచ్ వేసిన హైదరాబాద్ పోలీసులు కేటుగాళ్ల గుట్టురట్టు చేశారు. బోరుబండ ప్రాంతంలో రాత్రి వేళల్లో ఓ విచిత్రమైన సంఘటన చోటుచేసుకుంది. బీఎస్ఎన్ఎల్ కంపెనీకి సంబంధించిన భూగర్భ కేబుల్స్‌ను దొంగతనం చేశారు. అనుమానం వచ్చి సీసీ కెమెరా పుటేజీ చెక్ చేయడంతో అసలు భాగోతం బయటపడింది.
బోరబండ ప్రాంతంలో బీఎస్ఎన్ఎల్ కంపెనీకి సంబంధించిన భూగర్భ కేబుల్స్ పనులు జరుగుతున్నాయి. 14 మంది సభ్యులతో కూడిన ఒక గ్యాంగ్ కూలీల అవతారం ఎత్తారు. ఈ గ్యాంగ్ సభ్యులు రోడ్డు పనుల కోసం కార్మికులుగా మారిపోయి, రాత్రి పూట తమ కార్యాచరణను కొనసాగించారు. అందరూ ఒక్కసారిగా వచ్చినట్లు కాకుండా, ఈ గ్యాంగ్ సభ్యులు తమను అధికారిక సిబ్బందిగా చూపించడానికి ప్రతిరోజూ రాత్రి రెఫ్లెక్టివ్ జాకెట్లు ధరించి వచ్చేవారు. వీరి ఉద్దేశం రాత్రి వేళల్లో ఎవరికీ అనుమానం రాకుండా పనులు చేసుకోవడం. పక్కా స్కెచ్‌తో వీరు మరింత విశ్వసనీయంగా కనిపించడానికి సంబంధిత పనులు చేస్తున్నట్లు ప్రజల ముందు ప్రవర్తించారు. గ్యాంగ్ సభ్యులు రాత్రివేళల్లో బీఎస్ఎన్ఎల్ కేబుల్స్‌ను కట్ చేసి తీసుకెళ్లడం మొదలుపెట్టారు. ఈ కేబుల్స్ లో ముఖ్యమైన కాపర్ వంటివి దొంగిలించారు. ఇలా 10 లక్షల రూపాయల విలువైన కాపర్ వైర్లు కొట్టేశారు.
అయితే, ఈ గ్యాంగ్ అనుకోని విధంగా వారి పథకం విఫలమైంది. అయితే వీరు చేస్తున్న పనిని సీసీ కెమెరా దృశ్యాలు పట్టించాయి. హైదరాబాద్ బోయిన్‌పల్లి పోలీసులు వీరి అనుమానాస్పద దృశ్యాలను గమనించారు. అనుమానం కలిగిన పోలీసులు వారికి అనుమానం రాకుండానే గ్యాంగ్ సభ్యులను పట్టుకున్నారు. తీరా విచారణ చేసినప్పుడు, ఈ గ్యాంగ్ సభ్యులు తమ కార్మికుల వేషాలతో అసలు నిజాన్ని పోలీసుల ముందు ఒప్పుకున్నారు.
పోలీసులు ఎట్టకేలకు వీరి నుంచి దొంగిలించిన కేబుల్స్‌ను స్వాధీనం చేసుకుని, 14 మంది సభ్యులను అరెస్టు చేశారు. వీరి ఆర్థిక పరిస్థితి బాగోలేని కారణంగానే ఈ తరహాలో దొంగతనాలు చేయాలని నిర్ణయించుకున్నట్లు పోలీసులు విచారణలో బయటపడింది. వీరంతా కేవలం రాత్రి వేళల్లోనే ఈ తరహా కేబుల్స్ దొంగతనాలు చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. గతంలో పోలీస్ కమాండ్ కంట్రోల్స్ సెంటర్‌లోనూ ఇదే తరహాలో కేబుల్స్ మాయమైన ఘటన చోటుచేసుకుంది. ఆ వ్యవహారంలోనూ పోలీసులు పలువురిని అరెస్టు చేశారు.
మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..