ఖమ్మం, జనవరి 9: పెళ్లి అంటే నూరేళ్ళ పంట. ఆకాశమంత పందిరి వేసి… మంగళ వాయిద్యాలతో వేద మంత్రాలు, అగ్ని సాక్షిగా తాళి కట్టి ఏడు అడుగులు వేసి వధువు వరులు పెళ్లితో ఒకటి అవుతారు. ఇదంతా హిందూ సాంప్రదాయ పద్ధతిలో జరిగే పెళ్లి సందడి. క్రైస్తవ మతం పద్ధతి ప్రకారం చర్చ్ లో వధువు వరులు చేతి ఉంగరాలు మార్చుకొని పెళ్లి చేసుకుంటారు. ముస్లిం మతం ఆచార ప్రకారం షాధి జరుపుకోవడం.. ఇలా మన దేశంలో వారి వారి మతాలకు అతీతంగా పెళ్ళిళ్ళు జరుగుతుంటాయి. కానీ అందరికీ ఆర్చర్యంగా దళిత వర్గానికి చెందిన ఒక జంట బాబా సాహెబ్ అంబేద్కర్ ను దైవంగా భావించి సాక్షాత్తూ అంబేద్కర్ సాక్షిగా ఆదర్శ వివాహం చేసుకోవడం స్థానికులను అందరినీ ఆకట్టుకుంది…అంబేద్కర్ పోటో పెట్టుకొని..రాజ్యాంగం పై ప్రమాణం చేసి..ఎలాంటి హడావుడి ,ఆర్భాటం లేకుండా వివాహం చేసుకున్నారు.
ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం రామానగరం గ్రామంలో అంబేద్కర్ కాలనీకి చెందిన పిల్లి ప్రసన్న కుమార్, మనీషాలు భారత రాజ్యాంగ కర్త డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఫ్లెక్సీ సాక్షిగా పెళ్లి వేడుకను జరుపుకున్నారు. ఈ ఆదర్శ వివాహానికి గ్రామస్థులు, బందువులు, స్నేహితులు, డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ సంఘం నాయకులు హాజరై నూతన వధువు వరులను ఆశీర్వదించి ప్రశంసలు జల్లు కురిపించారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి.