ప్రీతి సూసైడ్ కేసులో 970 పేజీలతో చార్జిషీట్‌.. ఆమె హాస్టల్ రూమ్‌ చూసి పేరెంట్స్ కన్నీరుమున్నీరు

|

Jun 07, 2023 | 9:21 PM

తెలంగాణలో సంచలనం రేపిన మెడికో ప్రీతి ఆత్మహత్య కేసులో పోలీసులు చార్జిషీట్ దాఖలు చేశారు. కులం పేరుతో దూషించిన కారణంగానే ప్రీతి సూసైడ్ అటెంప్ట్ చేసిందన్నారు. సైఫ్‌ వేధింపులే ప్రధాన కారణమని చార్జిషీట్‌లో ప్రస్తావించారు.

ప్రీతి సూసైడ్ కేసులో 970 పేజీలతో చార్జిషీట్‌.. ఆమె హాస్టల్ రూమ్‌ చూసి పేరెంట్స్ కన్నీరుమున్నీరు
Medico Preethi
Follow us on

ప్రీతి సూసైడ్ కేసులో 970 పేజీలతో కోర్టులో చార్జిషీట్‌ ఫైల్ చేశారు వరంగల్ పోలీసులు.  ప్రీతి మృతికి ప్రధానంగా సైఫ్‌ వేధింపులే కారణమని పేర్కొన్నారు. కులం పేరు ప్రస్తావిస్తూ ర్యాగింగ్‌ చేయడంతో ప్రీతి డిప్రెషన్‌కి లోనై బలవన్మరణానికి పాల్పడిందని వివరించారు పోలీసులు. సైఫ్‌ చాలాసార్లు ప్రీతిని హేలన చేస్తూ మాట్లాడటమే కాకుండా మానసికంగా ఇబ్బంది పెట్టినట్టు ఆరోపించారు. ఆ టార్చర్‌ భరించలేక ఈ ఏడాది ఫిబ్రవరి 22న ఉదయం 8 గంటల 10 నిమిషాలకు ఆత్మహత్యాయత్నం చేసిందన్నారు. ఆ తర్వాత హైదరాబాద్‌ నిమ్స్‌లో చికిత్స పొందుతూ ఫిబ్రవరి 22న చనిపోయిందన్నారు.

ప్రీతి డెత్ కేసులో మొత్తం 70మందిని విచారించారు. సైంటిఫిక్‌, టెక్నికల్‌, మెడికల్, ఫోరెన్సిక్‌ నిపుణుల సహకారంతో ప్రీతి, సైఫ్‌, వాళ్ల మిత్రులు వాడిన సెల్‌ఫోన్‌ డేటాను వెలికితీశామన్నారు. వేర్వేరు కోణాల్లో సాక్ష్యాధారాలు సేకరించి.. ఆరాతీశాకే ప్రీతి సూసైడ్‌కి సైఫ్‌ కారణమని చార్జిషీట్‌లో పేర్కొన్నామన్నారు పోలీసులు.  మరోవైపు వరంగల్‌ కాకతీయ మెడికల్ కాలేజీలో ప్రీతి ఉన్న హాస్టల్‌ రూమ్‌ను కుటుంబసభ్యుల సమక్షంలో పోలీసులు ఓపెన్‌ చేశారు. ఈ క్రమంలో వాళ్లంతా ఉద్వేగానికి లోనయ్యారు. ప్రీతికి చెందిన స్టడీ మెటీరియల్స్‌, దుస్తులు, ఇతర సామాగ్రి చూసి కన్నీటిపర్యంతమయ్యారు.

హాస్టల్‌ రూమ్‌లో ఉన్న వస్తువులు, కాలేజ్‌ సర్టిఫికెట్లు ఇచ్చినప్పటికీ అడ్వాన్స్‌ ఫీజు సెటిల్ చేయలేదంటున్నారు ప్రీతి కుటుంబసభ్యులు. అలాగే ప్రభుత్వం ప్రకటించిన ఆర్థిక సాయం, ఉద్యోగం కూడా సాధ్యమైనంత త్వరగా ఇవ్వాలని విఙ్ఞప్తి చేశారు. మరోవైపు గురువారం ప్రీతి స్వగ్రామం మొండ్రాయిలో ఆమె సమాధి మందిరం ఆవిష్కరణ జరగనుంది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం..