తెలంగాణ తదుపరి సీఎం ఎవరన్న దానిపై ఇంకా సస్పెన్స్ కొనసాగుతోంది. ఎన్నికల్లో మ్యాజిక్ ఫిగర్ దాటేసి విజయం సాధించినప్పటికీ.. కాంగ్రెస్ పార్టీకి సీఎం అభ్యర్ధిని ప్రకటించడం కత్తి మీద సాములా మారింది. ఆ పార్టీలోని సీనియర్ నేతలందరూ కూడా తాము సీఎం రేసులో ఉన్నామంటే.. తాము ఉన్నామంటూ కీలక వ్యాఖ్యలు చేస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే తాజాగా కాంగ్రెస్ సీనియర్ నేత శ్రీధర్ బాబు సంచలన వ్యాఖ్యలు చేసి సీఎం అభ్యర్ధి విషయంపై ఇంకాస్త ఉత్కంఠతను పెంచేశారు. సీఎం రేసులో పార్టీలోని 64 మందీ ఉన్నారని.. వాళ్లతో పాటు తానూ రేసులో ఉన్నానని సంచలన వ్యాఖ్యలు చేశారు శ్రీధర్ బాబు. అయితే ఈ విషయంలో మాత్రం అధిష్టానం నిర్ణయమే ఫైనల్ అని స్పష్టం చేశారు.