
చనిపోయాడనుకున్న వ్యక్తి లేచి కూర్చున్న సంఘటన వనపర్తి జిల్లా కేంద్రంలో చోటు చేసుకుంది. వనపర్తి జిల్లాకు చెందిన తైలం రమేష్ తెలంగాణ ఉద్యమకారుడుగా స్థానికంగా మంచి పేరుంది. ఉద్యమంలో మాజీ మంత్రి నిరంజన్ రెడ్డితో కలిసి పనిచేశాడు. ఈ క్రమంలో మాజీ మంత్రి నిరంజన్ రెడ్డికి రమేష్ వీరాభిమానిగా మారాడు. ఆయనపై ఉన్న అభిమానానికి చెరగని గుర్తుగా సింగిరెడ్డి తన ఛాతీపై నిరంజన్ రెడ్డి చిత్రం, పేరును పచ్చబొట్టుగా పొడిపించుకున్నాడు.
వృత్తి రీత్యా కొన్నాళ్లుగా తైలం రమేష్ హైదరాబాద్‌లో నివాసం ఉంటున్నాడు. ఆదివారం వనపర్తి జిల్లా కేంద్రంలోని పీర్లగుట్టలోని బంధువుల ఇంటికి వచ్చాడు. అక్కడే బంధువులతో కలిసి అల్పాహారం తిన్నాడు. అనంతరం కొద్దిసేపటికే రమేష్ అస్వస్థతకు గురయ్యాడు. ఉలుకు పలుకు లేకుండా పడిపోయాడు. ఎంత పిలిచినా, ఏ చప్పుడు చేసినా ఉలుకు పలుకు లేకుండా ఉండడంతో రమేష్ మరణించాడని భావించారు. దీంతో ఆదివారం సాయంత్రం అంతిమ సంస్కారాలు చేసేందుకు ఏర్పాట్లు చేశారు. ఇంట్లోనే పడుకొబెట్టి పూలమాలలు వేశారు. దహన సంస్కారాల కోసం అన్ని ఏర్పాట్లు చేశారు. కుటుంబ సభ్యులు, బంధువుల ఏడుపులతో విషాద ఛాయలు అలుముకున్నాయి.
ఇక తైలం రమేష్ మరణ వార్తను కుటుంబ సభ్యులు, బంధువులు, మాజీ మంత్రి నిరంజన్ రెడ్డికి సమాచారం అందించారు. విషయం తెలుసుకున్న నిరంజన్ రెడ్డి తైలం రమేష్‌ను చివరిచూపు చూసేందుకు పీర్లగుట్టలోని డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల వద్దకు వెళ్ళాడు. రమేష్ పార్థివదేహానికి పూలమాల వేసేందుకు ముందుకు వంగటంతో బాడీలో కదలిక ఉన్నట్లు నిరంజన్ రెడ్డి గుర్తించారు. రమేష్… రమేష్ అంటూ గట్టిగా పిలవడంతో మరింతగా కదలాడు. దీంతో దండలు అన్ని క్లియర్ చేసి… హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. చికిత్స అనంతరం కోలుకున్నాడు రమేష్. అనంతరం హైదరాబాద్‌లోని నిమ్స్‌కు తరలించారు. ఈ మొత్తం ఘటనను చూసినవారు ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. మరణించాడనుకున్న రమేష్ బతికిబట్టకట్టడం అందరినీ ఆశ్చర్యపరిచింది. ఇక రమేష్ కుటుంబ సభ్యులు, బంధువులు మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి సమయస్ఫూర్తికి కృతజ్ఞతలు తెలియజేశారు.