
గజ్వేల్, మార్చి 20: తెలంగాణలోని పలు ప్రాంతాల్లో గాలి వాన బీభత్సం సృష్టించింది. ఈదురుగాలులకు ఊయలలో ఆడుకుంటున్న చిన్నారి ఎగిరి 20 మీటర్ల దూరంలో డాబాపై పడి మృతిచెందింది. తల్లిదండ్రులు పొలానికి వెళ్లగా ఇంట్లో ఉన్న కవల చిన్నారులు రేకుల షెడ్డుకు ఊయల కట్టుకుని ఆడుకుంటున్నారు. ఇంతలో రాకాసి గాలిదుమారం సుడిగాలిలా విరుచుకు పడటంతో గద్ద తన్నుకుపోయిన కోడిపిల్లలా చిన్నారి సంగీత రేకుల షెడ్డుతో సహా విసిరికొట్టడంతో మృతి చెందింది. ఈ విషాద ఘటన మెదక్ జిల్లాలో చోటు చేసుకుంది. వివరాల్లోకెళ్తే..
మెదక్ జిల్లా కౌడిపల్లి మండలం రాజిపేట జాజితండాలో మంజుల, మాన్సింగ్ దంపతులకు కవలలు సంగీత, సీత సంతానం. అదే తండాలోని ప్రాథమికోన్నత పాఠశాలలో సంగీత (5) ఒకటో తరగతి చదువుతుంది. సోమవారం తల్లిదండ్రులు పొలానికి వెళ్లగా ఇంట్లో రేకుల షెడ్డుకు కట్టిన చీర ఉయ్యాలలో సంగీత ఆడుకుంటుంది. నానమ్మ, సీత పక్కింటి వెళ్లడంతో చిన్నారి ఒక్కతే ఇంట్లో ఆడుకుంటూ ఉంది. ఇంతలో కొద్దిసేపటికే భారీగా సుడిగాలి వీచింది. దీంతో ఇంటి రేకులతోపాటు చిన్నారి సంగీత ఎగిరిపోయి సుమారు 20 మీటర్ల దూరంలో రెండు ఇళ్ల అవతల ఉన్న స్లాబ్‌పై పడింది. దీంతో చిన్నారికి తీవ్ర గాయాలయ్యాయి. గమనించిన ఇరుగుపొరుగు గాయాలతో కొట్టుమిట్టాడుతున్న సంగీతను 108లో నర్సాపూర్‌లో ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అక్కడి నుంచి మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్‌కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మంగళవారం చిన్నారి సంగీత మరణించింది. కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు
సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలం కొల్గూరు గ్రామానికి చెందిన మన్నె సత్తయ్య-రేణుక దంపతులకు ఇద్దరు కుమారులు ఉన్నారు. పెద్ద కుమారుడు అనిల్ గజ్వేల్‌లో ఐటీఐ చదువుతున్నాడు. రెండో కుమారుడు వెంకటేశ్ (15) మండలంలోని అహ్మదీపూర్ జెడ్పీ ఉన్నత పాఠశాలలో టెన్త్ క్లాస్ చదువుతున్నాడు. ప్రస్తుతం పరీక్షలు జరుగుతుండగా.. పరీక్ష అనంతరం రోజుమాదిరిగానే పొలం వద్ద ఉన్న పశువులను సాయంత్రం వేళ ఇంటికి తోలుకొని వస్తున్న సమయంలో బలంగా ఈదురు గాలులు వీచాయి. వీటి ధాటికి రోడ్డుపక్కనున్న చెట్టుకొమ్మ విరిగి వెంకటేశ్‌పై పడటంతో అక్కడికక్కడే మృతిచెందాడు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి.