హైదరాబాద్‌లో స్ట్రీట్ డాగ్స్ మళ్లీ రెచ్చిపోతున్నాయి. వీధుల్లో స్వైర విహారం చేస్తున్నాయి. ఇంటి నుంచి అడుగు బయట పెట్టాలంటే జనం భయపడిపోతున్నారు. తాజాగా మియాపూర్ మక్తాలో జరిగిన దారుణ ఘటన అందర్నీ కలిచివేసింది. భిక్షాటన చేస్తున్న కుటుంబానికి చెందిన ఆరేళ్ల బాలుడు సాత్విక్ ఆడుకుంటూ వెళ్లి అదృశ్యమయ్యాడు. దాంతో బాలుడి కుటుంబసభ్యులు అంతటా వెతికారు. చివరకు అదే ఏరియాలోని డంపింగ్‌యార్డులో సాత్విక్ మృతదేహం లభించింది. బాలుడి ఒంటిపై కుక్కలు దాడి చేసిన గాయాలను స్థానిక పోలీసులు గుర్తించారు. డంపింగ్ యార్డు కావడంతో కుక్కలు అక్కడ పెద్దసంఖ్యలో బాలుడిపై దాడి చేసినట్లు స్థానికులు తెలిపారు. కుక్కల దాడికి బలైన కుమారుడిని చూసి తల్లిదండ్రులు బోరున విలపించారు.
వీధి కుక్కల దాడిలో మొన్న అంబర్‌పేట్..ఇప్పుడు మియాపూర్‌లో బాలుడు చనిపోవడం చాలా బాధాకరమన్నారు GHMC కమిషనర్ రోనాల్డ్ రోస్. బాధితులకు GHMC తరఫున రావాల్సిన రిలీఫ్‌ను అందజేస్తామన్నారు. వైల్డ్ డాగ్స్ మాత్రమే గుంపులుగా వచ్చి ఎటాక్ చేస్తుంటాయని, వీటి సంఖ్యను తగ్గించేందుకు స్పెషల్ డ్రైవ్ చేపట్టామన్నారు రోనాల్డ్ రోస్. ఏది ఏమైనా వీధి కుక్కల వరుస దాడులతో ప్రజలు బయటకెళ్లాలంటేనే బెంబేలెత్తిపోతున్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..