Telangana: తెలుగు రాష్ట్రాల్లో వరుస గుండెపోటు ఘటనలు అందరినీ ఆందోళనకు గురిచేస్తున్నాయి. నిత్యం యువకులు, మధ్య వయస్కులు ఒకరిద్దరు ఇలా గుండెపోటుతో హఠాన్మరణం చెందుతున్న ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. తాజాగా జగిత్యాల జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. షటిల్ ఆడుతున్న ఓ వ్యక్తి హార్ట్ అటాక్‌తో తనువు చాలించాడు. అతనితో పాటు షటిల్ ఆడుతున్న ఇతర క్రీడాకారులు ఈ అనూహ్య పరిణామంతో షాక్‌కు గురైయ్యారు. జగిత్యాల జిల్లాకు చెందిన గంగారాం అలాయాస్ బూస్ శ్రీను(56) వాకింగ్ అనంతరం క్లబ్‌లో షటిల్ ఆడుతున్నాడు.అంతలోనే ఒక్కసారిగా అతను కుప్పకూలిపోయాడు. అది గమనించిన అక్కడి క్రీడాకారులు వెంటనే అతనికి సీపీఆర్ చేశారు. అనంతరం ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. స్థానికంగా ఈ ఘటన కలకలం సృష్టించింది.
యువకులు, మధ్య వయస్కులు గుండెపోటు బారినపడకుండా తగిన ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. జీవనశైలి, ఆహారపు అలవాట్లు, మానసిక ఒత్తిడి తదితరాలు గుండెపోటు ఘటనకు కారణాలుగా విశ్లేషిస్తున్నారు. షుగర్, బీపీ, కొలెస్ట్రాల్ వంటి వ్యాధులున్న వారు ఆరోగ్యం విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని సలహా ఇస్తున్నారు. అలాగే మానసిక ఒత్తిడిని అదుపులో ఉంచుకునేందుకు యోగా, వ్యాయామం చేయాలని సూచిస్తున్నారు. పొగతాగడం, మద్యపానం వంటి దురలవాట్లను వెంటనే విడిచిపెట్టాలని సలహా ఇస్తున్నారు. కఠిన వ్యాయామం చేసేవారు, క్రీడా కార్యక్రమాల్లో పాల్గొనేవారు తరచూ తమ గుండెను పరీక్షించుకోవడం మంచిదని చెబుతున్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..