Manja: మాయదారి మాంజా.. తగిలితే తెగడమే.. జనగామలో పాపం నలుగురు…

|

Dec 30, 2024 | 5:31 PM

పతంగుల పండుగ పరేషాన్‌ చేస్తోంది. గాలిపటాలు ఎగరేసేందుకు వాడే చైనా మాంజా మనుషుల పాలిట యమపాశంగా మారుతోంది. కత్తులకంటే పదునుగా కుత్తుకలు కోస్తోంది. ప్రమాదకరమైన ఈ చైనా మాంజాను వినియోగించొద్దని ప్రభుత్వాలు ఎంత చెప్పినా జ‌నాలు మాత్రం వినిపించుకోవ‌ట్లేదు. చైనా మాంజాలపై నిషేధం ఉన్నప్పటికీ మార్కెట్‌లో విచ్చలవిడిగా లభిస్తోంది. తాజాగా ఈ చైనా మాంజా తెగి నలుగురు మెడకు చుట్టుకోవడంతో ఆసుపత్రి పాలైయ్యారు.

Manja: మాయదారి మాంజా.. తగిలితే తెగడమే.. జనగామలో పాపం నలుగురు...
Manja
Follow us on

జనగామలో నలుగురు వాహనదారుల ప్రాణాలకు ముప్పుతెచ్చిందీ చైనా మాంజా. జనగామ – సిద్దిపేట ప్రధాన రహదారిపై వెళ్తుండగా.. గాలిపటం తెగి మాంజా మెడకు చుట్టుకుంది. వాహనదారులు గుర్తించి బాధితులను ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం బాధితులంతా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. గాయపడ్డవారిలో ఇద్దరు చిన్నారులు ఉన్నారు.

వాస్తవానికి చైనా మాంజా కారణంగా ప్రతి సంక్రాంతి సమయంలో ఎంతో మంది చనిపోతున్నారు. తీవ్రంగా గాయపడిన వారు ఆసుపత్రుల పాలవుతున్నారు. అయినా మార్కెట్‌లో మాత్రం చైనా మాంజా విక్రయానికి మాత్రం అడ్డుకట్ట పడటం లేదు. పోలీసులు సోదాలు చేసి కేసులు నమోదు చేస్తున్నా ఫలితం లేకుండాపోతోంది. నైలాన్, సింథటిక్‌ దారానికి గాజు, ప్లాస్టిక్‌ పొడి పూసి మాంజా తయారు చేస్తారు. ఇది సాధారణ దారం కంటే గట్టిగా, పదునుగా ఉండటంతో ప్రమాదాలు జరుగుతున్నాయి. ఈ దారం పర్యావరణానికి ప్రమాదమని భావించిన జాతీయ హరిత ట్రైబ్యునల్‌తో పాటు రాష్ట్ర ప్రభుత్వం నిషేధం విధించింది. అయినా సంక్రాంతికి చైనా మాంజా విక్రయాలు ఇష్టారీతిన సాగుతున్నాయి. గతంలో ఇతర రాష్ట్రాల నుంచి నగరానికి రహస్యంగా తీసుకొచ్చి విక్రయించేవారు. ప్రస్తుతం ఆ వ్యాపారం లాభసాటిగా ఉండటంతో సొంతంగా ఇక్కడే తయారు చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు.

గాలి పటాలు ఎగరేసినప్పుడు తెగిపోయిన మంజా దారాలు చెట్లు, కరెంట్‌ తీగలు, స్తంభాలు, ఇళ్ల మధ్య వేలాడుతూ ఉంటాయి. పక్షులు ఎగిరివచ్చి వాటిలో చిక్కుకుపోయి మృత్యువాతపడుతున్నాయి. అందులో అరుదైన పక్షులు ఉంటున్నాయని, మాంజా కారణంగా కొన్ని జాతులు అదృశ్యమైపోవాల్సిన పరిస్థితి ఏర్పడుతోందని జంతు ప్రేమికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా చైనా మాంజా వినియోగంపై పోలీసులు కఠిన చర్యలు చేపట్టాలని స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు కోరుతున్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి