
తెలంగాణలో భారీగా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో చాలా ప్రాంతాలు జలమయమయ్యాయి. వాగులు, వంకలు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. ఈ క్రమంలో వనపర్తి జిల్లా మదనాపురంలో విషాదం చోటుచేసుకుంది. మండలంలోని ఊకచెట్టి వాగు ఉధృతంగా ప్రవహిస్తుండటంతో.. ద్విచక్రవాహనంపై ప్రయాణిస్తున్న ముగ్గురు నీటిలో గల్లంతయ్యారు. వర్షాల కారణంగా మదనాపురం ఆత్మకూరు మధ్య వాగుపై నిర్మించిన లో లెవల్ వంతెనపై వరద నీరు ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. దీంతో రవాణాకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఈ సమయంలో కొందరు వాగు దాటేందుకు ప్రయత్నించి అందులో గల్లంతయ్యారు. శనివారం ఉదయం నుంచి ఐదుగురు గల్లంతు కాగా.. స్థానికుల సాయంతో ఒడ్డుకు ఇద్దరు యువకులు ఒడ్డుకు చేరారు. మరో ముగ్గురి ఆచూకీ లభించలేదు.
సాయంత్రం వేళ ద్విచక్ర వాహనంపై ఇద్దరు మహిళలతో వస్తున్న వ్యక్తి.. అదుపుతప్పి బైకుతో పాటు వాగులో పడిపోయాడు. ప్రవాహ ఉద్ధృతికి చూస్తుండగానే ముగ్గురూ నీటిలో కొట్టుకుపోయారు. వారిని రక్షించేందుకు అక్కడే ఉన్న ముగ్గురు యువకులు ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయిందని స్థానికులు వెల్లడించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని.. గల్లంతైన వారి కోసం తీవ్రంగా గాలిస్తున్నారు. గల్లంతైన వారు కౌకుంట్లకు చెందిన సంతోష (35) పరిమళ(18) తో పాటు సాయికుమార్(25) గా గుర్తించారు. వారు మదనాపురం నుంచి ఆత్మకూరుకు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు తెలిపారు.
కాగా.. సెప్టెంబర్ 7న ఆత్మకూరుకు చెందిన ఓ యువకుడు కొత్తకోట నుంచి ఆత్మకూరుకు వెళ్తుండగా.. ఇదే వాగులో గల్లంతై మృతిచెందాడు. నెల రోజుల్లోనే మరోసారి ముగ్గురు గల్లంతు కావడంతో స్థానికులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. నీరు ఉధృతంగా ప్రవహిస్తునప్పుడు ఈ మార్గం గుండా అనుమతించడం వల్లే ప్రమాదాలు జరుగుతున్నాయని స్థానికులు పేర్కొంటున్నారు. చీకటి పడటంతో గాలింపు చర్యలకు ఆటంకం కలిగింది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం..