ఒరిస్సాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో హైదరాబాద్‌కు చెందిన ముగ్గురు వ్యక్తులు దర్మరణం పాలయ్యారు. పాతబస్తీ నుంచి ప్రయివేట్ ట్రావెల్స్ బస్సులో తీర్థయాత్రకు వెళ్లి అనంత లోకాలకు పయనమయ్యారు. శనివారం తెల్లవారుజామున ఆగి ఉన్న ట్రక్కును ట్రావెల్ బస్సు వేగంగా డీ కొట్టింది. దీంతో డ్రైవర్ ఉదయ్ సింగ్ తోపాటు మరో ఇద్దరు మృతి చెందారు. ఈ విషాద ఘటన బెత్తోనటి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. మరో 20మంది తీవ్రంగా గాయపడ్డారు.
క్షతగాత్రులను బెత్తోనటి మెడికల్ ఆసుపత్రికి తరలించారు. హైదరాబాద్ పాతబస్తీ ఉప్పుగూడ కు చెందిన ఉదయ్ సింగ్ ఠాకూర్ (53) వృత్తిరీత్యా డ్రైవర్, ట్రావెల్ ఏజెంట్. ఉదయ్ సింగ్ తీర్థ యాత్ర ట్రిప్‌లు తీస్తుంటాడు. ఈ నేపథ్యంలోనే హైదరాబాద్ పాతబస్తీ ఉప్పుగూడతోపాటు ఇతర ప్రాంతాలకు చెందిన మరో 23 మందితో కలిసి నార్త్ ఇండియా టూర్‌కి ప్లాన్ చేశాడు. ఇందులో భాగంగానే 12 రోజుల నుంచి 15 రోజుల పాటు జరిగే యాత్రలో ఉప్పుగూడ శివాజీ నగర్ కు చెందిన నిత్యశ్రీ ట్రావెల్స్‌కు చెందిన 22 సీటర్ ఎస్‌ఎంఎల్ బస్సు డ్రైవర్ మల్లేష్ అనే వ్యక్తి తో ఒప్పందం కుదుర్చుకున్నాడు.
జూలై 8 వ తేదీన పాతబస్తీ ఉప్పుగూడ నుంచి ఉదయ్ సింగ్ అతని భార్య విజయ, కూతురు స్రవంతి, కుమారుడు వినీత్ లతోపాటు మరో 19 మందితో కలిసి నార్త్ ట్రిప్ కు బయలు దేరారు. తెలంగాణ రాష్ట్రం మీదుగా ఆంధ్రప్రదేశ్ దిశగా మధ్యలో ఉన్న పుణ్య క్షేత్రాలను చూసుకుంటూ ఈ నెల 12 వ తేదీన పూరి జగన్నాథ్ దేవాలయంకు చేరుకున్నారు. ఒరిస్సా లోని బాలాపూర్ మీదుగా బీహార్ కు వెళ్తున్న క్రమంలో మయూరభంజ్ జిల్లా బెత్తోనటి పోలీస్ స్టేషన్ పరిధిలో బుడి కమర్ చక్ ప్రాంతంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.
ఆగి ఉన్న ట్రక్ ను బస్సు డీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఉదయ్ సింగ్ తోపాటు ఒకే కుటుంబానికి చెందిన అన్న ఉప్పలయ్య (70), చెల్లెలు క్రాంతి భాయ్ (62) అక్కడికక్కడే మృతి చెందారు. డ్రైవర్ మల్లేష్ కు కాలు విరగడంతోపాటు తీవ్ర గాయాలు అయ్యాయి. మరో 20 మందికి కూడా తీవ్ర గాయాలు అయినట్లు క్షతగాత్రుల బంధువులు తెలిపారు. గాయపడిన వారిని బెత్తోనటి మెడికల్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..