పన్నా గనిలో అరుదైన వజ్రం.. వామ్మో.. దీని విలువ ఎంతో తెలుసా..?
పన్నా గనిలో తెలంగాణ ప్రభుత్వ ఆధ్వర్యంలోని ఎన్‌ఎండీసీకి చెందిన సిబ్బంది అరుదైన వజ్రం లభించింది. దీనికి వేలం నిర్వహించిన విక్రయించనున్నారు. దీని విలువ రూ.2.5 కోట్ల వరకు ఉంటుందని అధికారులు అంచనా వేేస్తున్నారు. తమ సిబ్బంది కృషికి ఇది నిదర్శనమని ఎన్‌ఎండీసీ సీఎండీ తెలిపారు.

మధ్యప్రదేశ్‌లోని పన్నా వజ్రాల గనిలో భారీ డైమండ్ దొరికింది. తెలంగాణ ప్రభుత్వ ఆధ్వర్యంలోని ఎన్‌ఎండీసీకి చెందిన సిబ్బంది ఏకంగా 27.29 క్యారెట్ల జెమ్ క్వాలిటీ వజ్రాన్ని వెలికితీశారు. పన్నా గనిలో కార్యకలాపాలు మొదలైన తర్వాత లభించిన వజ్రాల్లో ఇది రెండో అతిపెద్దది కావడం విశేషం. ఈ డైమండ్‌కు వేలంలో భారీ ధర వచ్చే అవకాశం ఉంది. దీని ఆకారం, రంగు, స్వచ్ఛత, బరువును పరిశీలించిన తర్వాత ప్రారంభ వేలం ధరను సుమారు రూ.కోటిగా నిర్ణయించే అవకాశం ఉందని ఎన్‌ఎండీసీ తెలిపింది. వేలం పూర్తయ్యే సమయానికి ఈ వజ్రం రూ.2 కోట్ల నుంచి రూ.2.5 కోట్ల వరకు ధర పలికే ఛాన్స్ ఉందని పేర్కొంది.
ఈ అరుదైన వజ్రం లభించడంపై ఎన్‌ఎండీసీ సీఎండీ అమితవ ముఖర్జీ స్పందించారు. ఇది తమ సిబ్బంది కష్టానికి దక్కిన గుర్తింపని చెప్పారు. దేశంలోని ఖనిజ సంపదలో ఎంతటి విలువ దాగి ఉందో ఈ వజ్రం మరోసారి చూపించిందన్నారు. కేవలం ఐరన్ ఓర్‌కే పరిమితం కాకుండా ఇతర విలువైన ఖనిజాల వ్యాపారాన్ని కూడా విస్తరించేందుకు సంస్థ పనిచేస్తోందని తెలిపారు. పన్నా ప్రాజెక్టు ఎన్‌ఎండీసీకి ఉన్న ఏకైక డైమండ్ మైన్. అంతేకాదు.. దక్షిణాసియాలోనే ఏకైక యాంత్రీకృత వజ్రాల గనిగా ఇది కొనసాగుతోంది. ఎన్‌ఎండీసీకి చెందిన నవరత్న పీఎస్‌యూలో నాన్-ఐరన్ ఓర్ బిజినెస్‌కు ఈ ప్రాజెక్టు కీలకంగా ఉంది. ఈ గనిలో ఏడాదికి దాదాపు 84 వేల క్యారెట్ల వజ్రాలను ఉత్పత్తి చేసే సామర్థ్యం ఉంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఆగస్టు వరకు సుమారు 6 వేల క్యారెట్ల వజ్రాలను ఉత్పత్తి చేసినట్లు సంస్థ వెల్లడించింది.
పన్నా ప్రాంతంలో ఎన్‌ఎండీసీ ప్రయాణం దాదాపు ఆరు దశాబ్దాలుగా కొనసాగుతోంది. 1965లో వజ్రాల అన్వేషణ, ప్రారంభ మైనింగ్ పనులను మొదలుపెట్టిన సంస్థ.. 1966-68 మధ్య మజ్‌గావన్ డైమండ్ ప్రాజెక్టును అధికారికంగా స్వాధీనం చేసుకుంది. ఆ తర్వాత 1971-72లో మజ్‌గావన్ గనిలో కమర్షియల్ స్థాయిలో పూర్తి స్థాయి యాంత్రీకృత డైమండ్ ప్రొడక్షన్ ప్రారంభమైంది. ప్రస్తుతం ఉన్న ఖనిజ నిల్వలతో పాటు నియంత్రిత ఓపెన్‌కాస్ట్ బెంచ్ మైనింగ్ ద్వారా వజ్రాలను వెలికితీస్తున్నారు. మైనింగ్‌తో పాటు పర్యావరణ పరిరక్షణకు కూడా ప్రాధాన్యం ఇస్తున్నామని ఎన్‌ఎండీసీ చెబుతోంది. ఆర్థిక ప్రయోజనాలు, పర్యావరణ బాధ్యత రెండింటినీ బ్యాలెన్స్ చేస్తూ కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్లు పేర్కొంది. పన్నా గనిలో ఇప్పటివరకు లభించిన అతిపెద్ద వజ్రం 34.37 క్యారెట్లు. 2010లో బయటపడిన ఈ జెమ్ క్వాలిటీ డైమండ్‌ను వేలంలో రూ.3.2 కోట్లకు విక్రయించారు. ఇప్పుడు దొరికిన 27.29 క్యారెట్ల వజ్రం పరిమాణంలో ఆ రికార్డు తర్వాత రెండో స్థానంలో నిలిచింది. వేలం పూర్తయ్యే వరకు దీని తుది ధర ఎంత పలుకుతుందనేది ఆసక్తికరంగా మారింది.
