బెల్లంపల్లి, డిసెంబర్ 4: ప్రేమ పేరిట ఓ పెద్ద మనిషి యువతిని నిండాముంచాడు. పైగా ఆయనొక నియోజక వర్గానికి అధ్యక్షుడు కూడా. ప్రేమా.. పెళ్లి.. అంటూ ఓ యువతికి దగ్గరయ్యాడు. తీరా పెళ్లి మ్యాటర్ లేవనెత్తడంతో మన కులాలు వేర్వేరంటూ ముఖం చాటేశాడు. దీంతో తీవ్రమనస్తాపం చెందిన యువతి అవమానంభారం తాళలేక నిండు ప్రాణాలను తీసుకుంది. ఈ షాకింగ్ ఘటన మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..
మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలోని హనుమాన్‌బస్తీకి చెందిన జంగపల్లి సాయిస్నేహిత (21)కు అదే పట్టణంలోని మహ్మద్‌ఖాసీంబస్తీకి చెందిన భారాసవి నియోజకవర్గ అధ్యక్షుడు ఈదునూరి శ్రీనాథ్‌తో కొన్నేళ్ల క్రితం పరిచయం ఏర్పడింది. అది కాస్తా ప్రేమగా మారింది. దీంతో తమ ప్రేమ విషయం తమ ఇళ్లల్లోని పెద్దలకు చెప్పి, పెళ్లి చేసుకోవాలని సాయిస్నేహిత కోరింది. అయితే శ్రీనాథ్ తమ కులాలు వేర్వేరని చెబుతూ పెళ్లిని వాయిదా వేస్తూ వచ్చాడు. ఈ క్రమంలో సోమవారం సాయంత్రం సాయిస్నేహిత ఫోన్ చేసి శ్రీనాథ్‌తో చాలా సేపు మాట్లాడింది. అసలు తనను పెళ్లి చేసుకునే ఉద్ధేశం ఉందో లేదో నిలదీసింది. ఈ క్రమంలో వారిద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. ఏం జరిగిందో తెలియదుగానీ అనంతరం ఇంట్లోకి వెళ్లిన సాయి స్నేహిత ఓ గదిలోకి వెళ్లి తలుపులు వేసుకుంది. అదే సమయంలో ఇంట్లోనే ఉన్న సోదరి ఎన్నిసార్లు తలుపు తట్టినా సాయి స్నేహిత తీయలేదు. ఇంతలో అక్కడికి చేరుకున్న శ్రీనాథ్ తలుపులు పగలగొట్టి లోనికి ప్రవేశించారు.
కానీ అప్పటికే ఆలస్యమైంది. సాయిస్నేహిత చున్నీతో ఫ్యాన్‌కు ఉరేసుకొని కనిపించింది. వెంటనే కిందికి దించగా.. యువతి కొన ఊపిరితో కొట్టుమిట్టాడటం గమనించిన ప్రియుడు శ్రీనాథ్ ఆమెను ఆస్పత్రికి తీసుకెళ్లడానికి బదులు.. అక్కడి నుంచి పరారయ్యాడు. కుటుంబ సభ్యులు హుటాహుటీన బాధితురాలిని బెల్లంపల్లి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అక్కడ పరిస్థితి విషమించడంతో మంచిర్యాలలోని ప్రభుత్వాసుపత్రిలో చేర్పించారు. అక్కడ చికిత్స పొందుతూ సాయి స్నేహిత సోమవారం అర్ధరాత్రి సమయంలో కన్నుమూసింది. మృతురాలి తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఏఎస్‌ఐ నర్సయ్య తెలిపారు. శ్రీనాథ్‌పై కేసు నడుస్తున్న నేపథ్యంలో పార్టీ అధిష్ఠానం అతడిని భారాసవి నియోజకవర్గ అధ్యక్షుడి పదవి నుంచి తొలగించారు. ఈ మేరకు ఆ జిల్లా అధ్యక్షుడు శ్రావణ్ తెలిపారు.