AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

తెలంగాణ ఐటీ బోనాల సంబంరం.. చూశారా ఈ వైభవం..

తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచిన 14వ ఐటీ బోనాలు హైదరాబాద్ ఐటీ కారిడార్‌లో అత్యంత వైభవంగా నిర్వహించారు. టిటా ఆధ్వర్యంలో జరిగిన ఈ మహోత్సవంలో వందలాది మంది ఐటీ ఉద్యోగులు, కుటుంబ సభ్యులు, ఎన్నారైలు పాల్గొన్నారు. శిల్పారామం నుంచి చిన్నపెద్దమ్మ ఆలయం వరకు...

తెలంగాణ ఐటీ బోనాల సంబంరం.. చూశారా ఈ వైభవం..
IT Bonalu
Ram Naramaneni
|

Updated on: Jul 27, 2026 | 5:23 PM

Share

తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచిన 14వ ఐటీ బోనాలు ఆదివారం అత్యంత వైభవంగా, భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. తెలంగాణ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అసోసియేషన్ (టిటా) ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకల్లో వందలాది మంది ఐటీ ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులు, ఎన్నారైలు, విదేశీ ప్రతినిధులు, ప్రజాప్రతినిధులు, వివిధ రంగాల ప్రముఖులు పాల్గొని అమ్మవారి ఆశీస్సులు పొందారు.

శిల్పారామం నుంచి చిన్నపెద్దమ్మ ఆలయం వరకు సాగిన మహా శోభాయాత్రలో 21 బోనాలు, 21 పోతరాజులు, ఒగ్గు డోలు, డప్పులు, శివసత్తులు తదితర తెలంగాణ జానపద కళారూపాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. జానపద వైభవం, అమ్మవారిపై భక్తి, ఐటీ యువత ఉత్సాహం కలగలిసిన ఈ వేడుక ఐటీ కారిడార్‌ను ఆధ్యాత్మిక, సాంస్కృతిక వాతావరణంతో నింపేసింది.

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కంటే ముందే, తెలంగాణ ఉద్యమం ఉద్ధృతంగా సాగుతున్న సమయంలో ఐటీ కారిడార్‌లో తెలంగాణ సంస్కృతిని సజీవంగా ఉంచాలనే సంకల్పంతో 2013లో టిటా ఐటీ బోనాలకు శ్రీకారం చుట్టింది. ఉద్యమ ప్రభావం, పరిపాలనా ఆంక్షల మధ్య ఆరంభమైన ఈ సంప్రదాయం ప్రతి ఆషాఢ మాసం రెండో ఆదివారం నిరాటంకంగా కొనసాగుతూ నేడు 14వ సంవత్సరానికి చేరుకుంది. తొలి శోభాయాత్ర సందర్భంగా టిటా గ్లోబల్ ప్రెసిడెంట్ సుందీప్ కుమార్ మక్తాలపై పోలీసు కేసు నమోదైనా, తెలంగాణ సంస్కృతిని ఐటీ యువతకు చేరువ చేయాలనే లక్ష్యంతో ఈ మహోత్సవం నిరంతరంగా కొనసాగుతోంది.

ఈ ఏడాది నూతన విగ్రహ ప్రతిష్ఠ అనంతరం చిన్నపెద్దమ్మ ఆలయంలో నిర్వహించిన తొలి ఐటీ బోనాలు కావడం మరో విశేషంగా నిలిచింది. ప్రతి ఏడాది మాదిరిగానే ఈసారి కూడా టిటా తొలి బోనం సమర్పించగా, అనంతరం సుందీప్ కుమార్ మక్తాల కుటుంబ సభ్యులు అమ్మవారికి సంప్రదాయబద్ధంగా ఒడిబియ్యం సమర్పించారు. ప్రత్యేక పూజల అనంతరం మహా శోభాయాత్ర కొనసాగగా, భక్తులకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు.

ఈ సందర్భంగా టిటా గ్లోబల్ ప్రెసిడెంట్ సుందీప్ కుమార్ మక్తాల మాట్లాడుతూ, “తెలంగాణ ఉద్యమ స్ఫూర్తితో ప్రారంభమైన ఐటీ బోనాలు నేడు ఐటీ ఉద్యోగుల సొంత సాంస్కృతిక ఉత్సవంగా రూపుదిద్దుకున్నాయి. ప్రతి ఆషాఢ మాసం రెండో ఆదివారం ఈ మహోత్సవాన్ని నిర్వహించడం ఆనందంగా ఉంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న యువతకు తెలంగాణ సంస్కృతి, అమ్మవారిపై భక్తిని పరిచయం చేయడం మనందరి బాధ్యత. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ఐటీ ఉద్యోగులు, ప్రజాప్రతినిధులు, కళాకారులు, స్వచ్ఛంద సేవకులు, భక్తులందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు” అని అన్నారు.

ఈ కార్యక్రమంలో టిటా సభ్యులు భగ్యలక్ష్మి వాకిటి, పంచలింగాల అక్షితా రెడ్డి, కీర్తన్ రాజ్, పరిడాల దినేష్ చౌదరి, చింతపల్లి మాధవ్ సాయి విశ్వేశ్, రాళ్లపల్లి వెంకట రోహిత్ కుమార్, మోదుమూడి పవన్ రాజా, అనిల్ చిన్నగారి, అభిలాష్ రంగినేని తదితరులు పాల్గొన్నారు.

Follow Us