Primary School: ‘మీ వెంటే మేము కూడా మాస్తారూ..’ బదిలీపై వెళ్లిన పాఠశాలలో చేరిన 133 మంది విద్యార్థులు!

ఇటీవల తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయుల బదిలీ జరిగిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఆయా ఉపాధ్యాయులు కొత్తగా బదిలీ అయిన పాఠశాలలకు తరలి వెళ్లిపోయారు. అయితే కొన్ని చోట్ల ఉపాధ్యాయులు బదిలీపై వెళ్లిపోతుంటే విద్యార్థులు భావోద్వేగానికి గురయ్యారు. వారిని చుట్టుముట్టి కన్నీరుమున్నీరుగా విలపించి కంటతడి పెట్టించారు. ఇలాంటి సన్నివేశాలు కొన్ని సార్లు అక్కడక్కడగా జరుగుతుంటాయి..

Primary School: 'మీ వెంటే మేము కూడా మాస్తారూ..' బదిలీపై వెళ్లిన పాఠశాలలో చేరిన 133 మంది విద్యార్థులు!
Akkapelliguda Primary School Students
Follow us
Srilakshmi C

|

Updated on: Jul 07, 2024 | 3:34 PM

మంచిర్యాల, జులై 7: ఇటీవల తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయుల బదిలీ జరిగిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఆయా ఉపాధ్యాయులు కొత్తగా బదిలీ అయిన పాఠశాలలకు తరలి వెళ్లిపోయారు. అయితే కొన్ని చోట్ల ఉపాధ్యాయులు బదిలీపై వెళ్లిపోతుంటే విద్యార్థులు భావోద్వేగానికి గురయ్యారు. వారిని చుట్టుముట్టి కన్నీరుమున్నీరుగా విలపించి కంటతడి పెట్టించారు. ఇలాంటి సన్నివేశాలు కొన్ని సార్లు అక్కడక్కడగా జరుగుతుంటాయి. అయితే, ఈ పాఠశాల విద్యార్ధులు మాత్రం బదిలీపై వెళ్లిన ఓ ఉపాధ్యాయుడితోపాటే ఏకంగా వందల సంఖ్యలో విద్యార్థులు పాఠశాల మారి అందరినీ ఆశ్చర్యపరిచారు. తమకు ఇన్నాళ్లు పాఠాలు చెప్పిన ఉపాధ్యాయుడితోపాటే విద్యార్ధులు కూడా పాఠశాల మారడం చర్చణీయాంశంగా మారింది. ఈ అరుదైన ఘటన మంచిర్యాల జిల్లాలో చోటుచేసుకుంది.

మంచిర్యాల జిల్లా జన్నారం మండలం పొనకల్‌ ప్రాథమిక పాఠశాలలో జాజాల శ్రీనివాస్‌ అనే వ్యక్తి 2012 జులై 13న ఎస్జీటీ ఉపాధ్యాయుడిగా చేరారు. ఆ సమయంలో ఆ పాఠశాలలో ఐదు తరగతులకు ఇద్దరు ఉపాధ్యాయులు ఉండేవారు. మొత్తం 32 మంది విద్యార్థులు పాఠశాలలో చదువుతూ ఉండేవారు. ఇక శ్రీనివాస్‌ ఆ పాఠశాలకు వెళ్లిన తర్వాత.. అక్కడ పిల్లల చేరికలు ఒక్కసారిగా పెరిగిపోయాయి. అందుకు కారణం ఆయన పిల్లలతో ఆప్యాయంగా మాట్లాడుతూ, ఆటపాటలతో పాఠాలు బోధించడమే. ప్రతి విద్యార్ధిపై ప్రత్యేక శ్రద్ధ చూపిస్తూ.. ఎంతో ఆప్యాయంగా విద్యాబుద్ధులు నేర్పుతున్న శ్రీనివాస్‌ మంచితనానికి విద్యార్ధులు ఒక్కరోజు కూడా బడి మానకుండా పాఠశాలకు వచ్చేవారు. దీంతో అక్కడి పాఠశాలలో విద్యార్థుల సంఖ్య క్రమంగా 250కి చేరింది.

ఈ క్రమంలో ఆయన జులై 1న ఇదే మండలంలో మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న అక్కపెల్లిగూడ పాఠశాలకు బదిలీ అయ్యారు. తమకు ఎంతో ప్రీతిపాత్రమైన ఉపాధ్యాయుడు వేరే పాఠశాలకు వెళ్లడం విద్యార్థులు తట్టుకోలేకపోయారు. తమకెంతో ఇష్టమైన మాస్టారున్న పాఠశాలలోనే ఆయన వెంటే తామూ చేరుతామంటూ పిల్లలు తల్లిదండ్రులతో గొడవకు దిగారు. దీంతో గంటల వ్యవధిలోనే అంటే జులై 2, 3 తేదీల్లో ఏకంగా 133 విద్యార్ధులను వారి తల్లిదండ్రులు మూడు కిలో మీటర్లు ప్రయాణం చేసి, అక్కపెల్లిగూడ బడిలో చేర్పించారు. దీంతో జూన్‌ 30న కేవలం 21 మంది విద్యార్థులున్న అక్కపెల్లిగూడ పాఠశాల విద్యార్ధుల సంఖ్య ఇప్పుడు 154 మందితో కళకళలాడుతోంది. ఈ పాఠశాలలో కూడా శ్రీనివాస్‌తోపాటు మరో ఉపాధ్యాయుడు మాత్రమే ఉండటం విశేషం.

ఇవి కూడా చదవండి

మరిన్ని తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి.