Swami Vivekananda: భాగ్యనగరానికి నేడు ప్రత్యేకమైన రోజు.. 128 ఏళ్ల క్రితం సరిగ్గా ఇదే రోజున..

Swami Vivekananda: ప్రపంచ వ్యాప్తంగా స్వామి వివేకానంద గురించి తెలియని వారు ఉండరంటే అతిశయోక్తి కాదు. ఆయన జీవించి..

Swami Vivekananda: భాగ్యనగరానికి నేడు ప్రత్యేకమైన రోజు.. 128 ఏళ్ల క్రితం సరిగ్గా ఇదే రోజున..
Follow us

|

Updated on: Feb 10, 2021 | 9:46 PM

Swami Vivekananda: ప్రపంచ వ్యాప్తంగా స్వామి వివేకానంద గురించి తెలియని వారు ఉండరంటే అతిశయోక్తి కాదు. ఆయన జీవించి ఉన్నది కొంతకాలమైనప్పటికీ.. తన వాక్చాతుర్యంతో యావత్ మానవాళిని సంఘటితం చేసిన మహానుభావుడిగా చిరకాలం నిలిచిపోయారు. ముఖ్యంగా భారతదేశ గొప్పదనాన్ని, దేశ సంస్కృతీ సంప్రదాయాల విశిష్టతను ప్రపంచానికి చాటిచెప్పిన ఘనుడు. అలాంటి వివేకానందుడితో మన భాగ్యనగరానికి విశేష అనుబంధం ఉంది. తెలంగాణ సమాజాన్ని మొత్తం తన గుప్పిట్లో పెట్టుకుని తాను ఆడిందే ఆట.. పాడిందే పాటగా రాజ్యపాలన సాగిస్తున్న నిజాం కోలువులోకి తొలిసారి అడుగు పెట్టిన వివేకానందుడు.. హైందవ ధర్మ గొప్పతనం, వేదాలు, ఉపనిషత్తుల ప్రాధాన్యత, నైతిక ఆదర్శాల గురించి ప్రసంగించి ఔరా అనిపించారు. ఆయన హైదరాబాద్ గడ్డపై అడుగుపెట్టి సరిగ్గా నేటికి 128 ఏళ్లు అవుతోంది. అందుకే ఇరోజుకి భాగ్యనగరం చరిత్రలో ప్రత్యేక స్థానం ఉంది.

చికాగో సర్వమత సమ్మేళనంలో పాల్గొనడానికి కొద్దిరోజుల ముందు స్వామి వివేకానంద 1893 ఫిబ్రవరి పదో తేదీన హైదరాబాద్ వచ్చారు. ఆ సందర్భంగా నవాబ్ సికిందర్ జంగ్‌తో పాటు పలువురు ప్రభుత్వ ఉన్నతోద్యోగులు, ప్రముఖులు వివేకానందకి ఘనంగా స్వాగతం పలికారు. ఆయనకు స్వాగతం పలికేందుకు రైల్వే స్టేషన్‌కు సుమారు 500 మంది తరలివచ్చారు. వారం రోజుల పర్యటనలో భాగంగా ఆయన హైదరాబాద్‌లోని పలు చారిత్రక ప్రదేశాలను, నిజాం రాజప్రసాదాలను, చార్మినార్, మక్కామసీదు సహా అనేక దేవాలయాలను సందర్శించారు. పర్యటనలో భాగంగా ఆయన నిజాం కొలువులో మత విధానాల గురించి చర్చించారు.

ముఖ్యంగా ఫిబ్రవరి 13న సికింద్రాబాద్ మహబూబ్ కాలేజీలో ‘మై మిషన్ టు ది వెస్ట్’ పేరుతో జరిగిన సభలో స్వామి వివేకానంద ప్రసంగించారు. యూరోపియన్లతో పాటు సుమారు వెయ్యిమంది ఈ సభకు హాజరయ్యారు. పాశ్చాత్య దేశాలకు తాను వెళ్లడంలోని ఉద్దేశంపై వివేకానంద ఆంగ్లంలో ప్రసంగించారు. భారత సంస్కృతీ, సంప్రదాయాలు, హైందవ ధర్మ గొప్పతనం, వేదాలు, ఉపనిషత్తుల ప్రాధాన్యత, నైతిక ఆదర్శాల గురించి ప్రసంగించిన ఆయన సభికులను మంత్రముగ్ధులను చేశారు. భారత్‌ను నూతన జవసత్వాలతో పునరుజ్జీవింపచేయాలనే తన లక్ష్యాన్ని ఆయన వెల్లడించారు. పెద్ద సంఖ్యలో హాజరైన ప్రజలనుద్దేశించి చేసిన ప్రసంగం వివేకానందుడిలో ఆత్మవిశ్వాసాన్ని మరింత ఇనుమడింపచేసింది.

హైదరాబాద్ పర్యటన తర్వాత వివేకానంద వెనుతిరిగి చూడాల్సిన అవసరం రాలేదు. చికాగోలోని విశ్వవేదికపై హైందవ ధర్మం గొప్పతనాన్ని, భారతీయ సంస్కృతీ సంప్రదాయాలను ప్రపంచానికి చాటి చెప్పారు. ఆ తర్వాత అమెరికా, యూరప్‌ సహా అనేక దేశాల్లో ఆయన పర్యటించి ప్రపంచానికి భారతీయ ఆధ్యాత్మిక ఆత్మను పరిచయం చేశారు. ముఖ్యంగా భారత యువతను తట్టిలేపారు. భారత్‌ను పరమవైభవస్థితికి తీసుకెళ్లేలా కృషి చేయాలని దిశానిర్దేశం చేశారు.

Also read:

ఉత్తరాఖండ్‌ విపత్తు అప్డేట్ : తపోవన్‌ టన్నెల్‌ దగ్గర ఇప్పటివరకు 36 మృతదేహాలు లభ్యం, ఇంకా దొరకని 180 మంది జాడ

2021లో ఐపీవోకి వెళ్లబోతోన్న టాప్ 10 కంపెనీలు, భారీ స్థాయిలో పెట్టుబడుల సమీకరణకు అడుగులు