Telangana: నమ్ముకున్న వాళ్లే ప్రాణం తీశారు.. ఓ వ్యాపారి 12 పేజీల మరణ వాంగ్మూలం!

| Edited By: Balaraju Goud

Jul 18, 2024 | 9:20 AM

అయినవాళ్లు ఆదుకోలేదు. తిండి తిప్పలు మానేసి చేసిన‌ వ్యాపారం పేరును తెచ్చిపెట్టినా, చెడు సహవాసాలు నిండా ముంచేశాయి. చివరికి మరణమే దిక్కంటూ 12 పేజీల సూసైడ్ నోట్ రాసి బలవన్మరణానికి‌ పాల్పడ్డాడు ఓ వ్యాపారి. ఈ ఘటన మంచిర్యాల జిల్లా‌ లక్షేట్టిపేట మున్సిపాలిటీ పరిధిలో చోటు ‌చేసుకుంది.

Telangana: నమ్ముకున్న వాళ్లే ప్రాణం తీశారు..  ఓ వ్యాపారి 12 పేజీల మరణ వాంగ్మూలం!
Suicide
Follow us on

అయిన వాళ్లు ఆదుకోలేదు. తిండి తిప్పలు మానేసి చేసిన‌ వ్యాపారం పేరును తెచ్చిపెట్టినా, చెడు సహవాసాలు నిండా ముంచేశాయి. చివరికి మరణమే దిక్కంటూ 12 పేజీల సూసైడ్ నోట్ రాసి బలవన్మరణానికి‌ పాల్పడ్డాడు ఓ వ్యాపారి. ఈ ఘటన మంచిర్యాల జిల్లా‌ లక్షేట్టిపేట మున్సిపాలిటీ పరిధిలో చోటు ‌చేసుకుంది.

లక్షేట్టిపేట పట్టణ కేంద్రంలో ముప్పై ఏళ్లుగా బోల్ల వ్యాపారం చేస్తూ జీవనం సాగిస్తున్నాడు శిశోద్యల ప్రతాప్ సింగ్. భార్య, ఇద్దరు కుమారులు. ఆరేళ్ళ క్రితం చిన్న కుమారుడు అకాల మరణం చెందడంతో కుంగిపోయాడు. ఆ సమయంలో అలవాటైన వ్యసనం తన ప్రాణమే తీస్తుందని కలలో కూడా ఊహించలేదు. ఆస్తిపాస్తులు సంపాదించి కుటుంబాన్ని బంగారంలా చూసుకుందామని అందరిలాగే కలలు కన్నా.. ఆ కలలన్నీ కల్లలయ్యాయి. చెడు సహవాసంతో ప్రారంభమైన పేకాట కొద్ది రోజుల్లోనే అన్నంత పని చేసింది. తన మరణానికి వీళ్ళే కారణమంటూ 12 పేజీల సూసైడ్ నోట్ రాసి ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు ప్రతాప్ సింగ్.

ప్రతాప్ సింగ్ సూసైడ్ నోట్ సారాంశం లోకి వెళితే..

“గౌరవనీయులైన పుర ప్రముఖులకు.. జిల్లా కలెక్టర్, సీపీ గారికి నమస్కారాలు…
బంధుమిత్రులకు నా విన్నపం. నా మరణానికి నా మిత్రులే కారణం. పేకాట పేరిట నన్ను నమ్మించి 10 శాతం వడ్డీకి డబ్బులిచ్చి నమ్మించి నిండా మోసం చేశారు. వారి కారణంగానే నేను చనిపోతున్నాను. అందులో ప్రధానమైన వ్యక్తి ఎడ్ల వ్యాపారి కలీమ్, చిత్తు బొత్తుల వడ్డీ వ్యాపారి పెట్టెం స్వామి, హోటల్ జగ్గన్న ఈ ముగ్గురు తనను పేకాట బారినపడేలా చేసి నమ్మించి మోసం చేసి అప్పుల పాలు చేశారు. ఒక లక్ష రూపాయలకు వారానికి పది వేల వడ్డీ వసూలు చేస్తూ నెల రోజుల్లోనే ముప్పై లక్షలు వసూలు‌ చేశారు. వీళ్ళే కాదు తన భూములను కబ్జా చేసి, ఇంటిని అమ్మిన డబ్బులను తిరిగి‌ ఇవ్వకుండా కొందరు, ఇలా పది మందికి పైగా నన్ను మోసం చేసి మానసికంగా నరకం చూపించారు. కోటి రూపాయల పైగా ఇచ్చిన అప్పుల డబ్బులు రావాల్సి ఉన్నా, యాభై లక్షల రూపాయలకు పైగా అప్పులు అవడంతో.. ఇచ్చిన డబ్బులు రాక చేసిన అప్పులు తీరక తనువు చాలిస్తున్నా” అంటూ సూసైడ్ నోట్ లో రాసుకొచ్చాడు ప్రతాప్ సింగ్‌.

తనకు కుటుంబ సభ్యులతో పాటు అయిన వాళ్లు కూడా సాయం చేయలేదని మానసికంగా వేధనకు గురై ఆత్మహత్య చేసుకుంటున్నాని, తనకు అన్యాయం చేసిన వారిని కఠినంగా శిక్షించాలని సూసైడ్ నోట్ లో వేడుకున్నాడు. తన మరణానంతరం తన అస్తికలను ఇంటి‌ ప్రదాన గేటు వద్ద ఉంచాలని ఇదే తన ఆఖరి కోరిక అని వేడుకున్నాడు. కొడుకు సిద్దు‌, భార్య ఉమకు విజ్ఞప్తి‌ చేసేదీ ఒక్కటే ఓపికగా ఉండండి.. కలిసి మెలిసి ఉండండి ఎవ్వరిని నమ్మకండి అంటూ ముగించాడు ప్రతాప్ సింగ్. ప్రతాప్ మరణంతో చెడు వ్యసనాలు, అతి నమ్మకం అన్నంత పని చేస్తుందని, నమ్ముకున్న కుటుంబాన్ని అగాథంలోకి తోస్తుందని మరోసారి రుజువైంది.

మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…