పదవ తరగతి హిందీ ఎగ్జామ్ క్వశ్చన్ పేపర్ లీక్ కేసులో అరెస్ట్ అయిన బండి సంజయ్‌ను కరీంనగర్ జిల్లా జైల్లో ఉంచారు. నిన్న రాత్రి నుంచి కరీంనగర్ జైల్లోనే ఆయన్ను ఉంచిన పోలీసులు.. ఆయనకు సాధారణ ఖైదీలకు ఇచ్చే భోజనం ఇచ్చినట్లు తెలుస్తోంది. ఉదయం పూట ఇడ్లీ, మధ్యాహ్నం అన్నంతో పాటు పప్పు టమోటా, రసం ఇచ్చారు. అంతేకాదు.. ఎలాంటి టెస్ట్ చేయకుండానే ఆయనకు ఆహారం ఇచ్చారని అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు బండి సంజయ్ తరఫున న్యాయవాదులు. అయితే, బండి సంజయ్‌కు ఆహారం విషయంలో కోర్టు నుంచి తమకు ఎలాంటి ప్రత్యేక ఆదేశాలు రాలేదంటున్నారు పోలీసులు. దాంతో అందరు ఖైదీలు మాదిరిగానే ఆయనకూ సాధారణ భోజనం అందించామని చెబుతున్నారు జైలు అధికారులు.
ఇదిలాఉంటే.. హనుమకొండ కోర్టు ఇచ్చిన డాకెట్ ఆర్డర్ సస్పెండ్ చేయాలని, తక్షణమే బండి సంజయ్‌ని విడుదల చేయాలని కోరుతూ ఆయన తరుఫు న్యాయవాదులు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అరెస్ట్ సమయంలో పోలీసులు 41-ఎ నోటీస్ ఇవ్వలేదన్నారు. అరెస్ట్ సమయంలో పోలీసులు దురుసుగా ప్రవర్తించారని, వేధింపులకు గురిచేయాలనే ఉద్దేశంతో కిలోమీటర్ల కొద్ది సంజయ్‌ని తిప్పారని పిటిషన్‌లో పేర్కొన్నారు. వరంగల్ కేసులో ఎలాంటి ఆధారాలు లేకుండానే అరెస్టు చేశారని అన్నారు. బీజేపీపై కుట్రలో భాగంగానే కేసులో ఇరికించారని, రిమాండ్ రిపోర్టులో సైతం నేరం చేసినట్టు ఎక్కడా పొందపర్చలేదన్నారు. అరెస్టు సమయంలో పోలీసులు సీఆర్పీసీ 50 నిబంధనలను పాటించలేదని పిటిషన్ లో ఆరోపించారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..