పర్యాటకులకు తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. ముఖ్యంగా పార్కులు, జూ పార్క్స్ సందర్శించాలనుకునే వారికి ఇది నిజంగా అద్భుతమైన వార్త అని చెప్పుకోవచ్చు. తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా హరితోత్సవాన్ని పురస్కరించుకుని జూన్ 19న రాష్ట్రంలోని అన్ని జాతీయ పార్కులు, అర్బన్ ఫారెస్ట్ పార్కులు, జూ పార్కుల్లోకి ఉచిత ప్రవేశం కల్పించింది ప్రభుత్వం. ఈ మేరకు ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ ఆర్‌ఎం డోబ్రియాల్ ఇక ప్రకటన విడుదల చేశారు.
శనివారం జరిగిన అధికారిక సమావేశంలో ఫ్రీ విజిటింగ్‌కు సంబంధించి నిర్ణయం తీసుకున్నారు. ఇందులో భాగంగా.. ప్రకృతితో విద్యార్థుల అనుబంధాన్ని బలోపేతం చేసే హరితోత్సవం లక్ష్యాన్ని కొనసాగించేందుకు, అన్ని జిల్లాల్లో అధికారులు వారి వారి ప్రాంతాల్లో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. ప్రతి గ్రామం, మండలం, జిల్లా వ్యాప్తంగా మొక్కలు నాటాలని, ఇందుకోసం ఏర్పాట్లు చేయాలని ఆర్ఎం డోబ్రియాల్ సూచించారు. గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు విస్తృతంగా చెట్ల పెంపకం ప్రాముఖ్యతను తెలియజేయాలన్నారు.
నైరుతి రుతుపవనాలు కూడా ప్రవేశించనుండటంతో.. హరితహారం తొమ్మిదవ దశను ప్రారంభించి, మొక్కలు నాటే కార్యక్రమాన్ని ఉధృతం చేయాలని సూచించారు. ఈ సమావేశానికి హాజరైన సీఎం స్పెషల్ డ్యూటీ ఆఫీసర్ ప్రియాంక వర్గీస్ మాట్లాడుతూ.. హరితోత్సవం రోజున హరితహారం విజయాలకు సంబంధించిన వీడియోలు, పోస్టర్ల ద్వారా ప్రదర్శిస్తామని తెలిపారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..