Social Media Guidelines India: సోషల్ మీడియాను కట్టడి చేయడమే లక్ష్యంగా కేంద్రం ప్రభుత్వం గురువారం నాడు మధ్యవర్తిత్వ మార్గదర్శకాలు, డిజిటల్ మీడియా ఎథిక్స్ కోడ్‌తో కూడిన సరికొత్త ఇన్ఫర్మెషన్ టెక్నాలజీ రూల్స్-2021 ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నిబంధనలతో సోషల్ మీడియా సాధనాలైన వాట్సప్, ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రమ్, ట్విటర్ కు ఇబ్బందులు తలెత్తే అవకాశం కనిపిస్తోంది. కొత్త నిబంధనలు అమల్లోకి రావడానికి ఇంకా సమయం ఉన్నప్పటికీ.. దాని పర్యవసనాలపై దేశ వ్యాప్తంగా అప్పుడే తీవ్రమైన చర్చ జరుగుతోంది. ఎందుకంటే.. ఒక సందేశం(వివాదాస్పద సందేశం) ఎవరి ద్వారా వచ్చేంది అనేది తెలుసుకోవడమే లక్ష్యంగా ప్రభుత్వం స్పష్టమైన నిబంధనలను తీసుకువచ్చింది. అయితే, వాట్సప్, సిగ్నల్, టెలిగ్రామ్ వంటి ఎండ్-టూ-ఎండ్ ఎన్‌స్క్రిప్షన్ ఉపయోగించే మెసేజింగ్ యాప్స్ ప్రభుత్వం తీసుకువచ్చిన నిబంధనలను పాటించాలంటే వాటి సెక్యూరిటీ విధానాలను అవే ఉల్లంఘించాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో అవి కేంద్రం నిబంధనలు పాటిస్తాయా? లేదా కేంద్రం ఆగ్రహానికి బలవుతాయా? అనేది కాలమే సమాధానం చెబుతుంది. అయితే, ఇదే అంశంపై దేశ వ్యాప్తంగా ఎలాంటి చర్చ జరుగుతుందో ఒకసారి పరిశీలిద్దాం.
ఇన్ఫర్మెషన్ టెక్నాలజీ రూల్స్-2021 ప్రకటన సందర్భంగా మంత్రులు ప్రకాష్ జావడేకర్, రవి శంకర్ ప్రసాద్‌లు కీలక అంశాన్ని పాయింట్ ఔట్ చేశారు. నూతనంగా తీసుకురానున్న చట్టం ప్రకారం.. ఏదైనా ట్వీట్ గానీ, మెసేజ్ గానీ ఇండియా నుంచి కాకుండా ఇతర దేశాల నుంచి వచ్చినట్లయితే సంబంధిత యాప్ ఆ విషయాన్ని ముందుగా ప్రభుత్వానికి తెలియాల్సి ఉంటుందనే వారి పాయింట్. అంతేకాదు సదరు మెసేజ్ ఇండియాలో ముందుగా ఎవరికి చేరిందనే విషయాన్ని ప్రభుత్వానికి తెలియజేయాలని మంత్రులు స్పష్టం చేశారు.
ఇక ఈ నిబంధనలు, మార్గదర్శకాలపై ఫేస్‌బుక్ ఇండియా ప్రతినిధి స్పందించారు. ‘ఇంటర్నెట్ పరిధిలో కష్టతరమైన సవాళ్లను పరిష్కరించడానికి కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన నిబంధనలను స్వాగతిస్తు్న్నాం. మా ఫ్లాట్‌ఫామ్‌పై(ఫేస్‌బుక్) ప్రజలు స్వేచ్ఛగా, సురక్షితంగా తమ భావాలను వ్యక్తీకరించే అంశంలో అన్ని నిబంధనలకు కట్టుబడి ఉన్నాము. ఆ కారణంగా కేంద్ర ప్రభుత్వం కొత్త విడుదల చేసిన మార్గదర్శకాలను పూర్తిగా అధ్యయనం చేయాల్సి ఉంది. నిబంధనలను పూర్తిగా అవగతం చేసుకున్న తరువాత దీనిపై స్పష్టమైన ప్రకటన చేస్తాం. ఇక దేశానికి సోషల్ మీడియా అందించిన సానుకూల సహకారాలపై మంత్రులు చేసిన వ్యాఖ్యలు పట్ల మేము సంతోషంగా ఉన్నాము. భారత్‌కు ఫేస్‌బుక్‌కు సన్నిహిత సంబంధం ఉంది. యూజర్ల భద్రత, రక్షణ మాకు ఎంతో ముఖ్యం. భారతదేశ సాంకేతికాభివృద్ధిలో మా వంతు పాత్ర ఉండేలా కృషి చేస్తూనే ఉంటాం’ అని చెప్పుకొచ్చారు.
ఇదిలాఉంటే గతంలో ‘వాట్సప్’ తీవ్రంగా వ్యతిరేకించిన బిల్డింగ్ ట్రేసిబిలిటీ విధానం కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన మార్గదర్శకాల్లో స్పష్టం కనిపిస్తోంది. ఇదే ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశం అయ్యింది. ఈ నిబంధనను అంగీకరిస్తే వాట్సప్ తమ ఎండ్-టు-ఎండ్ ఎన్క్రిప్షన్ నిబంధనలను ఉల్లంఘించాల్సి ఉంటుంది. ఆ కారణంగానే గతంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ‘బిల్డింగ్ ట్రేసిబిలిటీ అనేది ఎండ్-టు-ఎండ్ ఎన్క్రిప్షన్ విధానం, వాట్సప్ ప్రైవేట్ పాలసీని బలహీనపరుస్తుంది. ఈ విధానం ఇది తీవ్రమైన దుర్వినియోగానికి అవకాశం కల్పిస్తుంది. అయితే, వాట్సప్ అందించే గోప్యత రక్షణలు కట్టుదిట్టంగా ఉంటాయి’ అని వాట్సప్ ఇండియా ప్రతినిధి గతంలో ఓ సందర్భంగా పేర్కొన్నారు.
ఎండ్-టు-ఎండ్ ఎన్‌స్క్రిప్షన్‌కు సంబంధించి కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్ కీలక వ్యాఖ్యలు చేశారు. సోషల్ మీడియా సాధనాలైన మెసేజింగ్ యాప్స్ ఎండ్-టు-ఎండ్ ఎన్క్రిప్షన్‌ను ఉల్లంఘించాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. అసలు ఒక సందేశానికి సంబంధించి మూలకారకులను గుర్తించడమే ప్రభుత్వానికి కావాలి అని, సందేశాలు కాదని కేంద్ర మంత్రి రవిశంకర్ వివరణ ఇచ్చారు.
కొత్త నిబంధనల ప్రకారం.. ప్రముఖ సోషల్ మీడియా సాదనాలైన వాట్సప్, ఫేస్‌బుక్, యూట్యూబ్, ఇన్‌స్టాగ్రమ్, ట్విట్టర్ వంటి మెసేజింగ్ యాప్‌లు ఇక నుంచి కేంద్ర ప్రభుత్వం నిర్దేశించిన మార్గదర్శకాల పరిధిలోకి రానున్నాయి. ఈ నిబంధనల ప్రకారం.. ‘సోషల్ మీడియా మధ్యవర్తులు భారతదేశం సార్వభౌమాధికారం, సమగ్రతకు సంబంధించి నేరాలను గుర్తించడం, నివారించడం, దర్యాప్తు చేయడం, ప్రాసిక్యూషన్ చేయడం, శిక్షించడం వంటి చర్యల కోసం సందేశం(మెసేజ్) పంపిన మొదటి వ్యక్తిని గుర్తించి ప్రభుత్వానికి సమాచారం అందించాల్సి ఉంటుంది. రాష్ట్ర భద్రత, విదేశాలతో స్నేహ పూర్వక సంబంధాలు, ప్రజా సంబంధిత అంశాలు, అత్యాచారం, లైంగిక నేరాలకు సంబంధించి కంటెంట్‌ను ప్రోత్సహించడం ఐదేళ్ల జైలు శిక్షకు అర్హమైనది’ అని కేంద్ర ప్రభుత్వం తాజా మార్గదర్శకాల్లో పేర్కొంది. ఇదిలాఉంటే.. మొదటి సందేశం, ఇతర సమాచారాలు బహిర్గతం చేయాల్సిన అవసరం లేదంటూనే.. మూలకారకులైన వినియోగదారులను మాత్రం అప్రమత్తం చేయడం వంటి చర్యలకు పాల్పడొద్దంటూ సోషల్ మీడియా ఫ్లాట్‌ఫామ్ సంస్థలకు ప్రభుత్వం తేల్చిచెప్పింది.
కాగా, దేశ వ్యాప్తంగా సోషల్ మీడియా వేదికగా విపరీతమైన అసత్య వార్తలు ప్రచారం అవుతున్నాయి. దాన్ని వల్ల పలుమార్లు తీవ్ర వివాదలు, ఘర్షణలు చోటు చేసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో ఫేక్ వార్తల వ్యాప్తికి మూల కారకులైన వారిని గుర్తించే అంశంపై వాట్సప్ వంటి మెసేజింగ్ యాప్స్‌కు గతంలోనే ప్రభుత్వాలు పలు సూచనలు, ఆదేశాలు జారీ చేశాయి. అయినప్పటికీ వాటిని అవి పాటించిన దాఖలాలు లేవు. ఇవే అంశాల్లో పలుమార్లు ప్రభుత్వాలు సోషల్ మీడియా సాధనాలను తీవ్రంగా హెచ్చరించాయి కూడా. తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేసే వారిని కనిపెట్టి, అలాంటి ప్రచారాలు జరగకుండా ఒక విధానం తీసుకురావాలని ప్రభుత్వాలు ఆదేశించాయి. అయినప్పటికీ పెద్దగా మార్పు రాలేదు.
మరి తాజాగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన కొత్త నిబంధనలు పాటించడానికి వాట్సప్ వంటి వేదికలు ఎలాంటి చర్యలు తీసుకుంటాయో లేదో వేచి చూడాలి. ఒకవేళ వాట్సప్ గానీ, ఇతర మెసేజింగ్ యాప్స్ గానీ.. కేంద్ర ప్రభుత్వ విధానాలు పాటించకుంటే మాత్రం వాటి మెడమీద నిషేధం అనే కత్తి వేటు పడక తప్పదని విశ్లేషకులు భావిస్తున్నారు.
Also read:
ఎమ్మెల్సీ కవిత క్యాన్వాయ్‌లో ప్రమాదం.. ఒకదానికొకటి ఢికొన్న వాహనాలు..
‘కరివేపాకు’ను అలా తీసిపారేయకండి.. ఎన్నో రోగాలకు దివ్వఔషధం.. ఎందుకో తెలుసా..?