టయోటా ఫార్చ్యూనర్ కొత్త లీడర్ ఎడిషన్.. స్టార్టింగ్ ధర ఎన్ని లక్షలంటే
ప్రముఖ ఆటోమొబైల్ సంస్థ Toyota తన పాపులర్ SUV Fortunerలో కొత్త Leader Edition 2026ను మార్కెట్లోకి తీసుకొచ్చింది. బ్లాక్ స్టైలింగ్, కొత్త 18-అంగుళాల అల్లాయ్ వీల్స్, డ్యూయల్ టోన్ క్యాబిన్‌తో ఈ ప్రత్యేక ఎడిషన్ ఆకట్టుకుంటోంది. ఇప్పటికే ఫార్చ్యూనర్‌ను ఇష్టపడే కస్టమర్లను దృష్టిలో పెట్టుకుని తీసుకొచ్చిన ఈ SUV ధరలు, ఫీచర్లు, ఇంజిన్ వివరాలు తెలుసుకుందాం.

SUV కొనాలని చూస్తున్నవారికి Toyota Fortuner మరో కొత్త ఎంపికను అందిస్తోంది. 2026 Fortuner Leader Edition పేరుతో విడుదలైన ఈ మోడల్‌లో ప్రధానంగా డిజైన్, క్యాబిన్ అంశాల్లో మార్పులు చేశారు. 2.8 లీటర్ డీజిల్ ఇంజిన్, మాన్యువల్-ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్లతో వస్తున్న ఈ ఎడిషన్ ధర ఎంత? ఇందులో ఉన్న ప్రత్యేకతలేంటి?
ప్రముఖ కార్ల తయారీ సంస్థ Toyota తన ఫ్లాగ్‌షిప్ SUV Fortunerలో కొత్త Leader Edition 2026ను విడుదల చేసింది. సాధారణ ఫార్చ్యూనర్‌తో పోలిస్తే ఈ స్పెషల్ ఎడిషన్‌లో ఎక్స్‌టీరియర్ స్టైలింగ్, ఇంటీరియర్ డిజైన్‌లో మార్పులు చేశారు. బ్లాక్ కలర్ ఎలిమెంట్స్, కొత్త అల్లాయ్ వీల్స్, బ్లాక్-మెరూన్ క్యాబిన్ దీని ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. మాన్యువల్, ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్లలో అందుబాటులో ఉండే ఈ SUV ధరలు రూ.36.51 లక్షల నుంచి ప్రారంభమవుతున్నాయి.
అక్టోబర్ 12 నుంచి బుకింగ్స్!
Toyota Fortuner Leader Edition 2026ను రెండు వేరియంట్లలో అందుబాటులోకి తీసుకొచ్చారు. 4×2 మాన్యువల్ వేరియంట్ ధర రూ.36.51 లక్షలు కాగా, 4×2 ఆటోమేటిక్ వేరియంట్ ధర రూ.38.72 లక్షలుగా ఉంది. ఈ రెండు మోడళ్ల మధ్య ధర వ్యత్యాసం రూ.2.21 లక్షలు. బుకింగ్స్ 2026 అక్టోబర్ 12 నుంచి ప్రారంభం కానున్నాయి. కలర్ ఆప్షన్ల విషయానికి వస్తే Super White, Platinum White Pearl, Attitude Black రంగుల్లో ఈ SUV లభించనుంది. గతంలో అందుబాటులో ఉన్న Silver Metallic రంగును కొత్త ఎడిషన్‌లో తొలగించారు.
డిజైన్ పరంగా ఈ మోడల్‌కు బ్లాక్ స్టైలింగ్‌ను ప్రధాన ఆకర్షణగా నిలిపారు. ముందు భాగంలో బ్లాక్‌డ్-అవుట్ గ్రిల్, బ్లాక్ అండ్ సిల్వర్ ట్రిమ్‌తో కూడిన ఫ్రంట్ బంపర్ కొత్త లుక్‌ను అందిస్తాయి. బోనెట్‌పై ఉన్న బోల్డ్ ‘TOYOTA’ అక్షరాలు ప్రత్యేకంగా కనిపిస్తాయి. వీటికి తోడు కొత్త 18 అంగుళాల బ్లాక్ అల్లాయ్ వీల్స్, డ్యూయల్ టోన్ బ్లాక్ రూఫ్, వెనుక భాగంలో బ్లాక్ ట్రిమ్‌తో కూడిన టెయిల్‌గేట్ ఉన్నాయి.
శక్తివంతమైన డీజిల్ ఇంజిన్!
క్యాబిన్‌లో బ్లాక్, మెరూన్ రంగులతో కూడిన డ్యూయల్ టోన్ అప్‌హోల్స్టరీని అందించారు. సీట్లకు సరిపోయేలా డోర్ ట్రిమ్‌లను రూపొందించారు. డోర్ సిల్స్, యాంబియంట్ లైటింగ్ ఇంటీరియర్‌కు ప్రత్యేకమైన రూపాన్ని ఇస్తాయి. టైర్లలో గాలి ఒత్తిడిని పర్యవేక్షించే టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్ (TPMS) కూడా ఇందులో ఉంది.
ఇంజిన్ విషయానికి వస్తే Toyota Fortuner Leader Edition 2026లో 2.8 లీటర్, నాలుగు సిలిండర్ల డీజిల్ ఇంజిన్‌ను కొనసాగించారు. ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో ఈ ఇంజిన్ గరిష్ఠంగా 204hp పవర్, 500Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. మాన్యువల్ వేరియంట్‌లో టార్క్ 420Nmగా ఉంటుంది. రెండు వేరియంట్లలోనూ 6-స్పీడ్ గేర్‌బాక్స్ అందుబాటులో ఉంది.
