Online Fraud: ఆన్‌లైన్‌లో మోసపోయారా? ఇలా చేస్తే మీ డబ్బు తిరిగి వస్తుంది.. పూర్తి వివరాలు

ఏదో ఆఫర్ అంటూ వచ్చిన లింక్ పై క్లిక్ చేశారా? ఆ తర్వాత అకస్మాత్తుగా మీ ఖాతాలోని డబ్బులు మీకు తెలియకుండానే విత్ డ్రా అయిపోయాయా? మరి అలాంటి సందర్భంలో ఏం చేయాలి? పోయిన డబ్బు తిరిగి మళ్లీ వస్తుందా? అంటే వస్తుందనే చెబుతున్నారు సైబర్ నిపుణులు. అందుకోసం ఏం చేయాలి? ఎవరిని సంప్రదించాలి? తెలుసుకుందాం రండి..

Online Fraud: ఆన్‌లైన్‌లో మోసపోయారా? ఇలా చేస్తే మీ డబ్బు తిరిగి వస్తుంది.. పూర్తి వివరాలు
Online Fraud

Updated on: Apr 08, 2024 | 3:17 PM

దేశంలో సైబర్ నేరాలు, ఆన్ లైన్ మోసాలు బాగా పెరిగిపోతున్నాయి. డిజిటల్ లావాదేవీలు పెరిగి ప్రజలు సాంకేతికంగా ముందడుగు వేస్తున్న నేపథ్యంలో సైబర్ నేరగాళ్ల అనేక మోసాలకు పాల్పడుతున్నారు. ముఖ్యంగా బ్యాంకు అధికారులమంటూ నేరగాళ్లు ఫోన్లు చేస్తున్నారు. బ్యాంకు ఖాతా బ్లాక్ అయ్యిందని చెప్పి భయపెడుతున్నారు. వారిని నమ్మి వివరాలు చెప్పిన వారి ఖాతాల్లో సొమ్ములు మాయమవుతున్నాయి. సామాన్యులతో పాటు విద్యావంతులు, ఉద్యోగస్తులు కూడా మోసపోతున్నారు. ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు ఏం చేయాలి, పోయిన డబ్బు తిరిగి వచ్చే అవకాశం ఉందా అనే విషయాలను తెలుసుకుందాం.

సకాలంలో ఫిర్యాదు..

ఢిల్లీలోని ఓ ఆసుపత్రిలో పనిచేసే డాక్టర్ కూడా ఇలాగే మోసపోయాడు. అతడి క్రెడిట్ కార్డ్‌కు సంబంధించిన సమస్యపై కాల్ వచ్చింది. దానిని నమ్మి వివరాలు చెప్పిన వెంటనే అతడి ఖాతా నుంచి రూ.2 లక్షలు డ్రా అయ్యాయి. వెంటనే ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

ఆర్ బీఐ చర్యలు..

ఆన్ లైన్ మోసాలు పెరుగుతున్న నేపథ్యంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) తన ఖాతాదారులకు రక్షణకు చర్యలు తీసుకుంది. కొన్ని నిబంధనలు, మార్గదర్శకాలను వెల్లడించింది. వాటిని పాటిస్తే డబ్బును తిరిగి పొందే అవకాశం ఉంది. ఖాతాదారులందరూ ఈ నిబంధలను తెలుసుకోవడం చాలా ముఖ్యం.

ఇవి కూడా చదవండి

వీటిని తెలుసుకోండి..

ప్రజలు ఫోన్ బ్యాంకింగ్, నెట్ బ్యాంకింగ్, డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్, ఆన్‌లైన్ పేమెంట్, బ్యాంకింగ్ సమస్యల వల్ల మోసానికి గురైతే ఫిర్యాదు చేయవచ్చు. అయితే ఘటన జరిగిన మూడు రోజులలోనే బ్యాంకుకు రాత పూర్వకంగా తెలియజేయాలి. ఒకవేళ నాలుగు నుంచి ఏడు రోజులలో ఫిర్యాదు చేసినప్పటికీ మీరు డబ్బును తిరిగి పొందే అవకాశం ఉంది.

సైబర్ నిపుణులు చెబుతున్న తెలిపిన వివరాల ప్రకారం.. ఆర్‌బీఐ మార్గదర్శకాలు ఉన్నప్పటికీ బ్యాంకులు రీఫండ్‌లను వాయిదా వేసే అవకాశం ఉంది. ఆన్‌లైన్ మోసం బారిన పడిన వెంటనే అదే రోజు సమీపంలోని పోలీస్ స్టేషన్‌లో రాత పూర్వకంగా ఫిర్యాదు చేయాలి. అలాగే ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ (ఎఫ్‌ఐఆర్) నమోదు చేసుకోవడం చాలా మంచిది. ఒకవేళ అది సాధ్యం కాకపోతే ఫిర్యాదు చేసినట్లు రశీదు తీసుకోవాలి.

బ్యాంకును సందర్శించి, మోసం జరిగిన తీరును వివరిస్తూ లేఖ అందజేయాలి. దానితో పోలీసు స్టేషన్ లో ఇచ్చిన రశీదును కూడా సమర్పించాలి.

ఆర్ బీఐ ఈమెయిల్ ఐడీ అయిన crpc@rbi.org.inకి రెండు కాపీలను పంపాలి. దానిలో మీ బ్యాంక్ ఈమెయిల్ ఐడీని తప్పనిసరిగా చేర్చాలి. మోసం జరిగిన మూడు రోజులలో ఈ పని చేయాలి.

వీటికి అవకాశం లేదు..

ఆన్ లైన్ లో మోసాలు అనేక రకాలుగా జరుగుతున్నాయి. వాటిలో కొన్ని నిబంధనలకు విరుద్ధంగా ఉంటాయి. అలాంటి వాటిలో పోగొట్టుకున్న డబ్బు తిరిగి రాదు. అలాగే ఫిర్యాదు చేయడం ఆలస్యమైనా ఉపయోగం లేదు. మోసం జరిగిన ఏడు రోజుల తర్వాత పోలీసులకు, బ్యాంకు ఫిర్యాదు చేసినా లాభం లేదు. అలాగే బిట్‌కాయిన్, ఆన్‌లైన్ కరెన్సీ, ఆన్‌లైన్ గేమ్‌లు, బెట్టింగ్‌లో పోగొట్టుకున్న డబ్బు తిరిగి రాదు.

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..