
వేసవి వచ్చేసింది. ఎండలు క్రమంగా పెరుగుతున్నాయి. ఏప్రిల్ ప్రారంభంలోనే సూర్యుడు ప్రతాపం చూపిస్తున్నాడు. ఈ నేపథ్యంలో చల్లదనాన్ని ఇచ్చే ఏసీల వినియోగం బాగా పెరిగింది. భారత వాతావరణ విభాగం (ఐఎండీ) ఇచ్చిన నివేదిక ప్రకారం ఈ ఏడాది వేసవిలో ఉష్ణోగ్రతలు సాధారణం కంటే ఎక్కువగా నమోదవుతాయి. ఏప్రిల్ నుంచి జూన్ వరకూ ఇదే పరిస్థితి కొనసాగే అవకాశం ఉంది. దేశంలోని తూర్పు, ఈశాన్య, వాయువ్యంలో కొన్ని ప్రాంతాలను మినహాయించి మెజారిటీ ప్రాంతాల్లో ఎండలు విపరీతంగా కాసే అవకాశం ఉంది.
ఎండలు పెరిగేకొద్దీ ఏసీలపై అదనపు పనిభారం పడుతుంది. అలాగే విద్యుత్ బిల్లు ఎక్కువగా వస్తుంది. బిల్లుకు భయపడి మనం ఏసీలను వినియోగించడం మానలేం. ఏసీల చల్లదనాన్ని ఆస్వాదిస్తూ బిల్లుల భారాన్ని తగ్గించుకోవడానికి కొన్ని చిట్కాలు పాటించాలి. వీటి వల్ల ఏసీల పనితీరు మెరుగు పడడంతో పాటు కరెంటు బిల్లును ఆదా చేయవచ్చు. ఏసీల వినియోగదారులకు ఉపయోగపడే ఐదు చిట్కాలను అందజేస్తున్నాం.
ఏసీని తక్కువ సెట్టింగ్ లో ఉంచడం వల్ల గది వేగంగా చల్లబడుతుందని అనుకుంటాం. కానీ అలా చేయడం కరెక్టు కాదు. బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియెన్సీ సూచనల ప్రకారం ఏసీని 24 డిగ్రీల సెల్సియస్‌కు సెట్ చేయాలి. ఇది మన శరీరానికి సౌకర్యవంతంగా ఉంటుంది. నిజానికి ఏసీ సెట్టింగ్ ఒక డిగ్రీని తగ్గించడం వల్ల విద్యుత్ వినియోగం ఆరుశాతం పెరుగుతుంది. కాబట్టి మీ ఏసీని 20 నుంచి 24 డిగ్రీల మధ్య సెట్ చేసుకోండి. దీనివల్ల ఏసీ మెరుగ్గా పనిచేయడంతో పాటు విద్యుత్ వినియోగం తక్కువగా ఉంటుంది.
విండో ఏసీ అయినా, స్ల్పిట్ ఏసీ అయినా వాటి కండెన్సర్ యూనిట్ (వేడిని బయటకు పంపే భాగం) ఆరుబయటే ఉంటుంది. దీని ద్వారా బయట నుంచి దమ్ము వచ్చి ఫిల్టర్లలో చేరుతుంది. దుమ్ముతో నిండిన ఫిల్టర్ల వల్ల ఏసీ నుంచి చల్లగాలి రావడానికి ఇబ్బంది కలుగుతుంది. ఎక్కువ శక్తిని తీసుకుంటాయి. కాబట్టి ఫిల్టర్లను క్రమం తప్పకుండా శుభ్రం చేయించాలి. అలాగే రొటీన్ సర్వీసింగ్‌ను షెడ్యూల్ ప్రకారం నిర్వహించాలి. అంటే ప్రతినెలా ఫిల్టర్లను క్లీన్ చేయించాలి. ఏడాదికి ఒకటి లేదా రెండుసార్లు సాధారణ సర్వీసింగ్ చేయించాలి.
ఏసీ సమర్థంగా పనిచేయాలంటే, చల్లదనం పూర్తిగా విస్తరించాలంటే గదికి ఉన్న తలుపులు, కిటికీలు మూసివేయాలి. లేకపోతే కిటికీల నుంచి చల్లని గాలి బయటకు వెళ్లిపోతుంది. దీంతో గది చల్లబడడానికి ఏసీ ఎక్కువగా పనిచేయాల్సి ఉంటుంది. ఫలితంగా విద్యుత్ వినియోగం పెరుగుతుంది.
గదిలో చల్లదనం సక్రమంగా ఉండటానికి, అన్ని మూలలా ప్రసరించడానికి ఏసీ పనిచేసినప్పుడు ఫ్యాన్ ను కూడా వేసుకోవాలి. తక్కువ వేగంతో ఫ్యాన్ తిరగడం వల్ల చల్లని గాలి గది అంతా వ్యాపిస్తుంది. విద్యుత్ బిల్లు ఆదా అవుతుంది.
మీ ఏసీలో టైమర్ ను ఉపయోగించుకోవడం వల్ల విద్యుత్ బిల్లులను ఆదా చేయవచ్చు. నిద్రవేళకు ముందే టైమర్‌ను సెట్ చేయండి, తద్వారా గది సౌకర్యవంతమైన ఉష్ణోగ్రతకు చేరుకున్న తర్వాత అంటే ఒకటి లేదా రెండు గంటల అనంతరం ఏసీ దానికదే ఆఫ్ అవుతుంది. రోజంతా నాన్‌స్టాప్‌గా ఏసీని వినియోగించకూడదు.
మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..