New Scam In WhatApp: భారతదేశంలో ఆ మాటకొస్తే యావత్ ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ మంది ఉపయోగించే మెసేజింగ్ యాప్‌లలో వాట్సాప్ ప్రథమ స్థానంలో ఉంటుంది. ఎప్పటికప్పుడు కొంగొత్త ఫీచర్లను యూజర్లకు పరిచయం చేస్తుంది కాబట్టే ఈ యాప్‌కు అంత ప్రాముఖ్యత లభిస్తోంది. ఇదిలా ఉంటే ఎన్నో ఫీచర్లతో ఆకట్టుకుంటోన్న వాట్సాప్ పలు రకాల మోసాలకు కూడా కేరాఫ్‌గా మారుతోంది.
రకరకాల ఆఫర్లతో కూడిన మోసపూరిత ప్రకటనలు ఇటీవల వాట్సాప్‌లో బాగా సర్క్యూలేట్ అవుతున్నాయి. యూజర్లు కూడా వెనకా ముందు చూసుకోకుండా ఇలాంటి మెసేజ్‌లను ఇతరులకు ఫార్వర్డ్ చేసేస్తున్నారు. అయితే ఈ ప్రకటనల చాటున పెద్ద మోసమే జరుగుతోంది. తాజాగా ఇలాంటి ఓ ప్రకటన వాట్సాప్‌లో చక్కర్లు కొడుతోంది. జియో రూ.550ల ప్లాన్‌ను ఉచితంగా అందిస్తోందని.. ఈ ఆఫర్‌ను పొందాలంటే కింది లింక్ క్లిక్ చేయాలని ఓ సందేశం వస్తోంది. అయితే పొరపాటున ఆ లింక్ చేశారో ఇక మీ పని గోవింద అని హెచ్చరిస్తున్నారు సైబర్ నిపుణులు. సదరు లింక్ క్లిక్ చేసిన వెంటనే ఓ వెబ్‌సైట్ ఓపెన్ అవుతుంది. దీంతో మీ మొబైల్ లేదా కంప్యూటర్‌లో ఉన్న పూర్తి సమాచారం హ్యాకర్ల చేతుల్లోకి వెళిపోతుంది. మీ బ్యాంక్ అకౌంట్లకు సంబంధించిన వివరాలతో హ్యాకర్లు మీ ఖాతాలోని డబ్బులు కొట్టేసే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. కాబట్టి వాట్సాప్‌లలో వచ్చే ఇలాంటి సందేశాలను నమ్మకూడదనేది సైబర్ నిపుణుల సూచన.
Also Read: Life on Mars: గ్రహాంతర టూరిజం, అరుణగ్రహంపై మనుషులు నివాసం ఉండేలా ఓ నగరం.. డిజైన్ రెడీ