
సాధారణంగా ప్లాస్టిక్ వస్తువులు దృఢంగా ఉండటానికి కారణం వాటిలోని పాలిమర్ గొలుసులు. ఇవి ప్రకృతి సిద్ధంగా విచ్ఛిన్నం కావు. కానీ చైనా పరిశోధకులు ‘బాసిల్లస్ సబ్‌టిలిస్’ అనే ప్రత్యేక బ్యాక్టీరియా బీజాంశాలను ప్లాస్టిక్ తయారీలో జత చేస్తున్నారు. ప్లాస్టిక్ వస్తువును ఉపయోగించినంత కాలం ఈ బ్యాక్టీరియా నిద్రాణ స్థితిలో ఉంటుంది. అంటే, మనం ఆ వస్తువును వాడుతున్నప్పుడు అది ఎటువంటి ప్రభావం చూపదు. కానీ ఎప్పుడైతే ఆ ప్లాస్టిక్ వాడకం ముగిసిపోతుందో, అప్పుడు దానిని నిర్వీర్యం చేసే ప్రక్రియ మొదలవుతుంది. ఈ పద్ధతిలో కేవలం ఆరు రోజుల్లోనే మైక్రో ప్లాస్టిక్ అవశేషాలు కూడా మిగలకుండా ప్లాస్టిక్ పూర్తిగా అంతరించిపోవడం ఈ పరిశోధనలోని అసలైన మ్యాజిక్.
ఈ సరికొత్త ప్లాస్టిక్ తయారీలో పీసీఎల్ (పాలీ క్యాప్రోలాక్టోన్) అనే పదార్థాన్ని వాడుతున్నారు. ఇందులో బ్యాక్టీరియా బీజాంశాలను ఒక పొరలాగా నిక్షిప్తం చేస్తారు. వస్తువును పారేయాల్సిన సమయంలో, దానిని సుమారు 50 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత వద్ద ఉండే ఒక ప్రత్యేక పోషక ద్రావణంలో ఉంచుతారు. ఈ ఉష్ణోగ్రత మరియు ద్రావణం తగిలిన వెంటనే నిద్రలో ఉన్న బాసిల్లస్ బ్యాక్టీరియా ఉత్తేజితం అవుతుంది. ఒక్కసారి మేల్కొన్న తర్వాత, ఆ బ్యాక్టీరియా ఎంజైమ్‌లను స్రవించడం ప్రారంభిస్తుంది. ఈ ఎంజైమ్‌లు ప్లాస్టిక్ పాలిమర్ చైన్‌ను ముక్కలు చేసి చిన్న అణువులుగా మారుస్తాయి. ఆ తర్వాత బ్యాక్టీరియా వాటిని మోనోమర్ ఖండాలుగా విడదీసి పూర్తిగా హరిస్తుంది.
గతంలో ప్యాకింగ్ ప్లాస్టిక్ విచ్ఛిన్నం కోసం క్యూటినేసెస్, లైపేసెస్ వంటి ఎంజైమ్‌లను వాడినా, అవి ప్లాస్టిక్‌ను పూర్తిగా క్షయం చేయడంలో ఇబ్బందులు ఎదుర్కొనేవి. కానీ తాజా పరిశోధనలో ప్లాస్టిక్ అవశేషాలు కూడా మిగలకుండా మట్టిలో కలిసిపోయేలా చేయడంలో విజయం సాధించారు. దీనివల్ల పర్యావరణానికి ఎటువంటి ముప్పు ఉండదు సగటున 400 ఏళ్లు పట్టే విచ్ఛిన్న ప్రక్రియ కేవలం ఆరు రోజుల్లోనే ముగుస్తుంది. ఇది భవిష్యత్తులో బయోప్లాస్టిక్ రంగంలో ఒక భారీ మార్పుకు నాంది పలుకుతుందని నిపుణులు భావిస్తున్నారు.
ఈ రకమైన ‘ఎకో ఫ్రెండ్లీ’ ప్లాస్టిక్ వాడకం పెరిగితే సముద్రాలలో పేరుకుపోతున్న ప్లాస్టిక్ వ్యర్థాలకు పరిష్కారం లభిస్తుంది. మైక్రో ప్లాస్టిక్ రేణువులు ఆహార గొలుసులోకి ప్రవేశించి మనుషుల ఆరోగ్యాన్ని దెబ్బతీస్తున్న తరుణంలో, ఇలాంటి ఆవిష్కరణలు ఎంతో అవసరం. చైనా శాస్త్రవేత్తలు పీసీఎల్ ప్లాస్టిక్ మీద చేసిన ప్రయోగాలు విజయవంతం కావడంతో, దీనిని వాణిజ్యపరంగా అందుబాటులోకి తెచ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ప్లాస్టిక్ రహిత ప్రపంచం వైపు అడుగులు వేయడానికి ఇది ఒక గొప్ప మార్గం అని చెప్పవచ్చు. మనం వాడే వస్తువులు పర్యావరణానికి హాని చేయని విధంగా ఉండటం అనేది రేపటి తరం సుస్థిర అభివృద్ధికి ఎంతో కీలకం. శాస్త్రవేత్తల ఈ కృషి ఫలిస్తే, ప్లాస్టిక్ భూతం నుండి మన భూగ్రహాన్ని శాశ్వతంగా కాపాడుకోవచ్చు.