JPEG ఫైల్ కూడా సేఫ్ కాదా? టెక్ నిపుణుల కొత్త వార్నింగ్!
సైబర్ నేరగాళ్లు JPEG ఫైళ్లలో మాల్‌వేర్‌ను దాచి, నకిలీ పెళ్లి ఆహ్వానాల పేరుతో మీ సమాచారాన్ని దొంగిలిస్తున్నారు. తెలియని వ్యక్తుల నుండి వచ్చే ఫైళ్లు, లింక్‌లు తెరవవద్దు. యాంటీవైరస్ ఉపయోగించండి, అధికారిక యాప్ స్టోర్‌ల నుండే యాప్ లు డౌన్‌లోడ్ చేయండి.

సైబర్ నేరగాళ్లు రోజురోజుకు కొత్త పద్ధతులతో ప్రజలను మోసం చేస్తున్నారు. తాజాగా సాధారణ ఫోటో ఫైళ్లలా కనిపించే JPEG ఇమేజ్‌ల ద్వారానే మాల్‌వేర్‌ను పంపుతున్నట్లు సైబర్ భద్రతా నిపుణులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా వాట్పాప్ వంటి మెసేజింగ్ యాప్‌ల ద్వారా నకిలీ పెళ్లి ఆహ్వానాలు, ఫోటోలు, APK ఫైళ్లు పంపించి వినియోగదారుల వ్యక్తిగత సమాచారాన్ని దొంగిలించే ప్రయత్నాలు పెరుగుతున్నాయని తెలిపారు. సాధారణంగా JPEG ఫైల్ అంటే ఒక ఫోటో మాత్రమేనని చాలా మంది భావిస్తారు. అయితే ఇప్పుడు సైబర్ నేరగాళ్లు హానికరమైన కోడ్‌ను ఇమేజ్ ఫైళ్లలో దాచిపెట్టి పంపిస్తున్నారని నిపుణులు చెబుతున్నారు.
వినియోగదారులు ఆ ఫైల్‌ను తెరవగానే మాల్‌వేర్ మొబైల్ లేదా కంప్యూటర్‌లో ఇన్‌స్టాల్ అయ్యే ప్రమాదం ఉంది. ముఖ్యంగా బ్యాంకింగ్ యాప్ వివరాలు, పాస్‌వర్డ్‌లు, OTPలు, వ్యక్తిగత డేటా వంటి సున్నితమైన సమాచారం హ్యాకర్ల చేతికి వెళ్లే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు. ఇటీవల నకిలీ పెళ్లి ఆహ్వానాల పేరుతో జరుగుతున్న స్కామ్‌లు కూడా ఆందోళన కలిగిస్తున్నాయి. వెడ్డింగ్ ఇన్విటేషన్, ఫొటో ఆల్బమ్, ఈవెంట్ ఇమేజెస్ వంటి పేర్లతో వచ్చే ఫైళ్లలో ఇన్ఫెక్టెడ్ APKలు లేదా హానికరమైన లింక్‌లు దాగి ఉండొచ్చని సైబర్ భద్రతా సంస్థలు పేర్కొంటున్నాయి. ముఖ్యంగా తెలియని నంబర్ల నుంచి వచ్చే ఫైళ్లు లేదా అత్యవసరంగా ఓపెన్ చేయమని కోరే సందేశాల విషయంలో జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు.
నిపుణుల సూచనల ప్రకారం తెలియని వ్యక్తుల నుంచి వచ్చిన ఇమేజ్‌లు, లింక్‌లు లేదా ఫైళ్లను వెంటనే ఓపెన్ చేయకూడదు. ఫోన్‌లో యాంటీవైరస్ లేదా సెక్యూరిటీ యాప్‌ను అప్‌డేట్‌గా ఉంచుకోవడం మంచిదని చెబుతున్నారు. అలాగే గూగుల్ ప్లే స్టోర్, లేదా యాపిల్ అధికారిక యాప్ స్టోర్‌ల ద్వారా మాత్రమే యాప్‌లు డౌన్‌లోడ్ చేయాలని సూచిస్తున్నారు. సైబర్ నేరాలు పెరుగుతున్న నేపథ్యంలో చిన్న నిర్లక్ష్యమే పెద్ద నష్టాలకు దారితీయవచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అందువల్ల అనుమానాస్పద ఫైళ్లు, లింక్‌లు, డౌన్‌లోడ్‌ల విషయంలో అప్రమత్తంగా ఉండటమే ఉత్తమ రక్షణ అని వారు చెబుతున్నారు.
మరిన్ని టెక్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
