
ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్లలోని గూగుల్ అసిస్టెంట్ ను ఇప్పటికే జెమినీ ఏఐ భర్తీ చేసింది. త్వరలో ఆండ్రాయిడ్ ఆటో, వేర్ ఓఎస్ స్మార్ట్ వాచ్ లు, కనెక్ట్ చేసిన ఆడియో పరికరాలకు విస్తరించనుంది. దీని వల్ల ఆయా పరికరాల వినియోగదారులకు మరిన్ని మెరుగైన సేవలు అందుతాయని గూగుల్ చెబుతోంది. ముఖ్యంగా స్మార్ట్ వాయిస్ కమాండ్ లు, వేగవంతమైన ప్రతిస్పందనలు, మెరుగైన కార్యాచరణ అందిస్తుంది. వేర్ ఓఎస్ లో ఫిట్ నెస్ ట్రాకింగ్, నోటిఫికేషన్లు, వాయిస్ ఇంటరాక్షన్ ను మరింత మెరుగ్గా అందుతాయి. ఇక ఆండ్రాయిడ్ ఆటో వినియోగదారులు స్పష్టమైన డ్రైవింగ్ అనుభవం పొందుతారు.
ఈ కొత్త ప్రయోగాన్ని గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ కూడా నిర్దారణ చేశారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ మొబైల్ పరికరాల్లో గూగుల్ అసిస్టెంట్ ను జెమినికి అప్ గ్రేడ్ చేస్తున్నామని, ఈ ఏడాది చివరి నాటికి ట్యాబ్లెట్లు, కార్లు, ఫోన్ కు కనెక్ట్ అయ్యే హెడ్ ఫోన్లు, స్మార్ట్ వాచ్ లకు అనుసంధానం చేస్తామన్నారు.
ప్రముఖ టెక్ దిగ్గజం గూగుల్ తన యూజర్లకు మెరుగైన సేవలు అందిస్తూ ముందుకు సాగుతోంది. దానిలో భాగంగా ప్రత్యేక మైన ఏఐ అసిస్టెంట్ ను రంగంలోకి తీసుకువచ్చింది. దానికి గూగుల్ జెమినీ ఏఐ అని పేరు పెట్టింది. దీని ద్వారా వినియోగదారులకు ఎన్నో సేవలు అందజేస్తోంది. గతంలో ఆండ్రాయిడ్ 12, అంతకన్నా లేటెస్ట్ వెర్షన్లలో అందుబాటులో ఉండేది. ఇప్పుడు పాత వాటిలోనూ వినియోగించుకునేలా చర్యలు తీసుకుంటోంది.
ప్రపంచంలోని అన్ని టెక్ దిగ్గజ కంపెనీలు తమ ఏఐ టూల్స్ ను అప్ డేట్ చేసుకుంటూ పోతున్నాయి. ఈ విషయంలో వాటి మధ్య విపరీతమైన పోటీ నెలకొంది. దానిలో భాగంగానే గూగుల్ కూడా తన జెమినీ ఏఐని ఆధునికీకరిస్తూ అనేక ఫీచర్లను పరిచయం చేస్తోంది. ముఖ్యంగా చాట్ జీపీటీకి పోటీగా గూగుల్ తన చాట్ బాట్ అయిన బార్డ్ ను తీసుకువచ్చింది. కానీ చాట్ జీపీటీ స్థాయిని బార్డ్ అందుకోలేకపోయింది. దీంతో ఎంతో ఆలోచించిన గూగూల్.. బార్డ్ పేరును జెమినీ గా మార్చి లాంచ్ చేసింది. దీనిలో అనేక అడ్వాన్స్ డ్ ఫీచర్లను పరిచయం చేసింది. దీంతో యూజర్ల ఆదరణ పొందింది.
మరిన్ని టెక్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి